ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకపోతే మూడింతల బిల్లులు

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకపోతే మూడింతల బిల్లులు

జీడిమెట్ల, వెలుగు: ఫ్రీ వాటర్​ స్కీం కింద వాటర్​బోర్డు ఉచితంగా అందిస్తున్న 20 వేల లీటర్లు పొందడం జనాలకు కష్టంగా మారింది.  బోర్డు నిబంధనలు పేద, మధ్య తరగతి వారిని ఇబ్బంది పెట్టేలా ఉన్నా యని వాపోతున్నారు. మెరుగైన సేవలు అందిస్తున్నామని అధికారులు చెబుతుండగా క్షేత్రస్థాయిలో చాలా మంది లబ్ధిదారులు ఫ్రీ వాటర్ స్కీం పొందలేకపోతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల టైంలో ప్రతి కుటుంబానికి 20 వేల లీటర్ల తాగు నీటిని ఉచితంగా అందిస్తామని చెప్పి, గెలిచాక అనేక కొర్రీలు పెట్టడం కరెక్ట్​ కాదని మండిపడుతున్నారు. ఇంటి ఆక్యుపెన్సీ సర్టిఫ్టికెట్ నిబంధనతో మూడు రెట్లు ఎక్కువగా బిల్లులు వేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. నల్లా కనెక్షన్ పేరు  మార్చుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న స్థలంలో ఇల్లు కట్టుకున్నవారిని కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అడగడం కరెక్ట్​కాదని, ఉన్నతాధికారులు నిబంధనలను మార్చాలని కోరుతున్నారు. మధ్యతరగతి వారి నుంచి మూడింతలు బిల్లు కట్టడం కష్టమవుతుందని  చెబుతున్నారు. 

నోటిఫైడ్ ​స్లమ్ ​ఏరియాలు తప్ప..

నోటిఫైడ్ స్లమ్​ఏరియాలు మినహా మెజారిటీ కాలనీ లకు ఫ్రీ వాటర్ ​స్కీం అందడం లేదు. స్కీం పొందాలంటే మొదట ఆధార్ అనుసంధానం చేసుకోవాలి. నల్లాకి మీటర్ బిగించుకోవాలి. మీటర్ రన్నింగ్​లో ఉండాలి. ఇంటి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జతచేయాలి. మొదటి రెండు చేయగలిగినా, ఇంటి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేక మెజారిటీ మంది ఫ్రీ వాటర్​స్కీం పొందలేకపోతున్నారు. మహా నగరంలో కొద్దిపాటి జాగా ఉండటమే కష్టమైతే, అందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోవడం ఇంకా కష్టమవుతుందని జనం వాపోతున్నారు. చిన్నపాటి స్థలంలో సెట్ బ్యాక్ లేకుండా, అదనపు అంతస్తులతో నిర్మించిన ఇండ్లే 90 శాతం దాకా ఉన్నాయి. వీటన్నింటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందడం అసాధ్యం. దీన్ని అడ్డం పెట్టుకుని వాటర్​బోర్డు అధికారులు  ఫ్రీ వాటర్ ​స్కీం పొందకుండా చేస్తున్నారని జనం మండిపడుతున్నారు.

ప్రతి కాలనీలో నాలుగైదు అక్రమ కనెక్షన్లు 

అయితే వాటర్​బోర్డు అక్రమ కనెక్షన్లపై దృష్టి పెట్టకుండా, కొర్రీలతో అర్హులను ఫ్రీ వాటర్​స్కీం పొందకుండా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాల్లో కొన్నేండ్ల కిందట ఎవరికి వారు ఇష్టానుసారంగా అక్రమ కనెక్షన్లు తీసుకున్నారు. మరికొందరు అధికారికంగా ఒకటి, అక్రమంగా మరొకటి తీసుకుని వాడుకుంటున్నారు. ఇటీవల స్థానిక భగత్​సింగ్​ నగర్​లో విజిలెన్స్​ అధికారులు దాడులు చేయగా నాలుగు అక్రమ కనెక్షన్లు బయటపడ్డాయి. జీడిమెట్ల పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసి భారీ జరిమానాలు విధించారు. కేవలం ఒక్క బస్తీలోనే నాలుగు బయటపడితే సిటీ మొత్తం ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

బల్దియా జీవోలో అంతే ఉంది ఇంటి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుంటే  మూడు రెట్ల బిల్లు ఇవ్వాలని జీహెచ్ఎంసీ జీవో ఇచ్చింది. నిబంధన ప్రకారం బిల్డింగ్ కడితే బల్దియా అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్​ఇస్తారు. అది లేకుంటే ఫ్రీ వాటర్ ​స్కీం రాదు. సిటీలో 2012 తర్వాత ఇల్లు కట్టుకున్న వారికి ఆకుపెన్సీ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాల్సిందే.

– శ్రీధర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ వాటర్​వర్క్స్ జీఎం

పేరు మార్చేందుకు నెలలు పట్టింది

మేం 200 గజాల ప్లాట్​ కొన్నాం. అందులో అప్పటికే ఒక చిన్న రూమ్, నల్లా కనెక్షన్ ఉంది. నల్లా కనెక్షన్​ను మా పేరు మీదికి మార్చుకోడానికి చాలా ఇబ్బంది పడ్డాం. మొదట ఇంటి నంబర్​తెచ్చుకోమన్నారు. తిప్పలు పడి తెచ్చుకున్నాక మ్యుటేషన్​ జరగలేదు.. కుదరదన్నారు.  గతంలో ఇంటి నంబర్ లేకుండా మ్యుటేషన్​ఎలా అవుతుందని ఉన్నతాధికారులను సంప్రదించగా అప్పుడు మార్చారు. ఈ ప్రాసెస్​మొత్తానికి నెలలు పట్టింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్​లేకపోతే మూడింతలు బిల్లు వేయడం కరెక్ట్​కాదు. నిబంధనలు జనాల్ని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు.

– ఉమారాణి, కుత్బుల్లాపూర్