ఆడపిల్లలు, పేదలు చదువుకోకుండా కుట్ర!..27 వేల ప్రభుత్వ స్కూళ్లను 4 వేలకు కుదించడం దారుణం: కవిత

ఆడపిల్లలు, పేదలు చదువుకోకుండా కుట్ర!..27 వేల ప్రభుత్వ స్కూళ్లను 4 వేలకు కుదించడం దారుణం: కవిత
  • విద్యాశాఖను సర్కస్​లా మార్చేశారని ఫైర్
  • ఎస్సీల్లోని అన్ని ఉప కులాలకూ తహసీల్దార్లే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ మాత్రమే కాదని, ఆడ పిల్లలు, పేదలకు చదువును దూరం చేస్తున్న తాలిబాన్ అని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఫైర్​అయ్యారు. రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామనడం దారుణమన్నారు.

తాలిబాన్లు ఆడబిడ్డలకు చదువు దూరం చేశారని, అదే తరహాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్లను మూసేసి ఆడపిల్లలు, పేదలకు చదువులు అందకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. 27 వేల స్కూళ్లను కుదిస్తే అందులో పని చేస్తున్న 3 లక్షలకు పైగా ప్రభుత్వ టీచర్లను ఏం చేస్తారో చెప్పాలని ఆమె నిలదీశారు.

విద్యాశాఖను రేవంత్ రెడ్డి సర్కస్ లా మార్చేశారని కవిత విమర్శించారు. ఈ ఏడాది నుంచే ఇంటర్మీడియట్ ఉండదని, ప్లస్ 2 విధానం తెస్తానని సీఎం ప్రకటించిన మరుసటి రోజే ఇంటర్ బోర్డు అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. జూనియర్ కాలేజీలు ప్రారంభమై వారం అవుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు అఫిలియేషన్ లు ఇవ్వలేదన్నారు.

డిగ్రీ అడ్మిషన్లను కూడా గందరగోళంగా మార్చేశారని ధ్వజమెత్తారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కొన్ని కోర్సులను సిఫార్సు చేస్తే.. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ మరికొన్ని కోర్సులు సిఫార్సు చేసిందని, వాటిలో ఏ ఒక్క కోర్సుకు కూడా యూనివర్సిటీలు అప్రూవల్ ఇవ్వలేదని తెలిపారు. గురుకులాల్లో వంద మందికి పైగా విద్యార్థులు చనిపోయినా ఈ ముఖ్యమంత్రి కనీసం సమీక్ష కూడా చేయడం లేదని ఆరోపించారు.

ఎస్సీల్లో 47 ఉప కులాలకే సర్టిఫికెట్లా..?

ఎస్సీ ఉప కులాల హక్కుల సాధన కోసం తాను ఉద్యమిస్తానని కవిత చెప్పారు. ఎస్సీల్లో 57 ఉప కులాలు ఉంటే అందులో 47 కులాలకే ఆర్డీవోలు క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ చేయడం అత్యంత విచారకరమన్నారు. అన్ని కులాలకూ తహసీల్దార్ లే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేశారు. సోమవారం బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఎస్సీ 57 ఉపకులాల నాయకులతో ఆమె సమావేశమయ్యారు.

సమాజంలో అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉప కులాల్లోని విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా గురుకులాల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధుల్లోనూ ఉప కులాలకు ప్రత్యేక వాటా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు.

లిడ్ క్యాప్ భూములను రక్షిస్తాం

గచ్చిబౌలిలోని లిడ్ క్యాప్ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం బడాబాబులకు కట్టబెట్టాలని చూస్తోందని, ఆ భూములను తాము రక్షిస్తామని కవిత పేర్కొన్నారు. జిల్లాల్లోని లిడ్ క్యాప్ భూములు రక్షించేందుకు కూడా ఉద్యమిస్తామన్నారు. గ్రామ దేవతల ఆలయాల్లో దళిత పూజారులకు అవకాశం ఇవ్వాలని, గ్రామ దేవతల ఆలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం ప్రోత్సాహకాలు అందజేయాలని కోరారు.

ఎస్సీ ఉప కులాల హక్కుల సాధన కోసం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఆందోళన చేస్తామని తెలిపారు. సమావేశంలో ఎస్సీ 57 ఉప కులాల ఐక్య వేదిక అధ్యక్షుడు చింతల రాజలింగం, టీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, ఆనందం తదితరులు పాల్గొన్నారు.