మైత్రివనంలోని కేఎస్ ఆర్ ఫ్యాషన్స్ బిల్డింగ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన దురదృష్టకరమన్న ఆమె... బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఏడాది ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోవడంతో... అగ్నిప్రమాదాలు కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి. అయినా సరే, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే వరుసగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకోవడానికి ఫైర్ సిబ్బందికి ఏకంగా గంటన్నర సమయం పట్టిందని... ప్రభుత్వ అలసత్వానికి ఇది నిదర్శనమని ఆమె విమర్శించారు.
ప్రమాద స్థలాన్ని హైడ్రా ఉన్నతాధికారులు వచ్చి పరిశీలించారు. ఈ ప్రమాదంలో దాదాపు 4 కోట్ల రూపాయల మేర భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆస్తి నష్టపోయిన వ్యాపారస్తులకు, బాధితులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు.
ఇలాంటి వాణిజ్య భవనాలపై హైడ్రా అధికారులు గట్టి నిఘా పెట్టాలని, నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ వినిపిస్తోంది. సీఎం రేవంత్ ఇప్పటికైనా స్పందించి... ఒక ప్రత్యేక రివ్యూ టీమ్‌ను ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తోందన్నారు.
