నడిగడ్డ హక్కుల పోరాట సమితి నేతపై హత్యాయత్నం

నడిగడ్డ హక్కుల పోరాట సమితి నేతపై హత్యాయత్నం

గద్వాల వెలుగు: జిల్లాలోని మల్దకల్ మండలంలో స్వయంభూలక్ష్మి వేంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల లొల్లి ముదిరి హత్యాయత్నానికి దారి తీసింది. రెండు రోజుల క్రితం నడిగడ్డ హక్కుల పోరాట సమితి సంఘం ఫ్లెక్సీలను టీఆర్ఎస్​కు చెందిన వారు చించేయడంతో పీఎస్​లో కంప్లయింట్ ​చేశారు. అయితే ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అనుచరుడు, యూత్​ వింగ్​ లీడర్​అయిన అజయ్, ఆయన డ్రైవర్ కొంతమందితో కలిసి వచ్చి శుక్రవారం మళ్లీ ఫ్లెక్సీలు చించారు. ‘మొన్న రాత్రి కాదు. ఇప్పుడు మీ కండ్లెదుటే, పట్టపగలే చించుతున్నాం ఏం చేస్తారో చేసుకోండి’ అంటూ రెచ్చగొట్టారు. దీన్ని అక్కడున్న నడిగడ్డ హక్కుల పోరాట సమితికి చెందిన ఇద్దరు ఫొటోలు తీశారు. తర్వాత వాటిని సంఘ కార్యదర్శి లావన్నకు వాట్సాప్​లో పంపారు. ఇది చూసిన ఆయన సద్దలోనిపల్లె నుంచి మల్దకల్ కు బయలుదేరారు. దీంతో అజయ్, అతడి డ్రైవర్, మరికొంతమంది అడ్డు వెళ్లి మార్గమధ్యలో లావన్నను అడ్డుకున్నారు. పొలంలోకి లాక్కెళ్లి  రాయితో తలపై కొట్టారు. చంపే ప్రయత్నం చేయగా అక్కడున్న స్థానికులు అడ్డుకున్నారు.  లావన్న గాయాలతో పీఎస్​లో కంప్లయింట్​చేసి ప్రభుత్వ దవాఖానాలో జాయిన్​ అయ్యాడు. దాడి జరిగిన విషయం తెలుసుకున్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి సభ్యులు, కొంతమంది రైతులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. అజయ్​తో పాటు ఆయనకు సహకరించిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని నినదించారు. ఘటనపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్పందించాలని డిమాండ్​చేశారు.