పెద్ద కులాలకే పెద్ద పీట

పెద్ద కులాలకే పెద్ద పీట

హైదరాబాద్‌‌, వెలుగు: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల్లో పెద్ద కులాలకే పెద్దపీట దక్కింది. ఆరు సీట్లు ఖాళీగా ఉండగా..  మూడు సీట్లు రెడ్లకు, ఒక సీటు వెలమ కులానికి టీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్​ కేటాయించారు. మండలి మాజీ చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌ రెడ్డి, మాజీ ఐఏఎస్‌‌ వెంకట్రామిరెడ్డి, హుజూరాబాద్‌‌కు చెందిన పాడి కౌశిక్‌‌ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌‌రావుకు అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీ రేసులోకి రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌‌ను అనూహ్యంగా తీసుకువచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కూడా అవకాశం కల్పించారు.  మంత్రులు కేటీఆర్‌‌, హరీశ్‌‌రావు తదితరుల సమక్షంలో వీళ్లు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉప సంహరణకు ఈ నెల 22 వరకు గడువు ఉంది. ఆ రోజే టీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించనున్నారు.

చివరి వరకు సస్పెన్స్​
ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్‌‌ చివరిక్షణం వరకు గోప్యత పాటించారు. పార్టీ తరఫున అభ్యర్థులెవరో కనీసం ప్రకటన కూడా విడుదల చేయలేదు. సోమవారం ప్రచారంలోకి వచ్చిన కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌‌ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌‌రావు, కౌశిక్‌‌ రెడ్డికి చాన్స్‌‌ ఇచ్చారు. కరీంనగర్‌‌ స్థానిక సంస్థల కోటాలో మాజీ ఐఏఎస్‌‌ వెంకట్రామిరెడ్డిని పోటీకి దింపవచ్చని ప్రచారం జరిగినా..  ఎమ్మెల్యే కోటాలోనే ఎంపిక చేశారు. బీసీ కోటాలో పదవి ఆశించిన వారికి కాకుండా బండ ప్రకాశ్‌‌ను రాజ్యసభ నుంచి మిడిల్‌‌ డ్రాప్‌‌ చేయించి మండలిలో అవకాశమిచ్చారు. కౌశిక్​రెడ్డిని గతంలో గవర్నర్‌‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్​ చేసినప్పటికీ.. ఇప్పుడు  ఎమ్మెల్యే కోటాలో చాన్స్‌‌ ఇచ్చారు. గవర్నర్​ కోటా ఎమ్మెల్సీకి సంబంధించి మరో అభ్యర్థి పేరును త్వరలోనే ప్రకటించనున్నారు. బండ ప్రకాశ్‌‌ను మండలికి తీసుకురావడంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని ఎవరికి ఇస్తారనే దానిపై రెండు పేర్లు ప్రధానంగా ప్రచారంలో ఉన్నాయి.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎస్సీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పేరు ఖరారు అయినట్టు సోమవారం ప్రచారం జరిగింది. మంత్రి హరీశ్‌రావుతో ఆయన ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిసివచ్చారు. ఇక ప్రకటనే తరువాయి అనుకున్న టైంలో శ్రీనివాస్​ పేరు పక్కన పెట్టేశారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక సమయంలో కోటిరెడ్డికి మండలిలో అవకాశం కల్పిస్తామని కేసీఆర్​ హామీ ఇచ్చారు. కోటిరెడ్డి కోసం మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎంతో చర్చలు కూడా జరిపారు. కానీ, ఆయన పేరునూ పక్కనపెట్టేశారు. నిజామాబాద్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు ఫైనల్‌ అయినట్టు ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో చాన్స్‌ దక్కలేదు. మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి ఎమ్మెల్యే కోటాలోనే ఎమ్మెల్సీ పదవి ఆశించినా.. ఆయనకు వేరే అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
 

రాజీనామా చేసిన 24 గంటల్లోపే ఎమ్మెల్సీ
సిద్దిపేట కలెక్టర్‌‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి ఐఏఎస్‌‌కు రాజీనామా చేసిన 24 గంటల్లోపే ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. సోమవారం మధ్యాహ్నం ఆయన ఐఏఎస్‌‌కు రాజీనామా చేయగా.. ప్రభుత్వం వెంటనే ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీతో పాటు కేబినెట్‌‌లోనూ అవకాశమిస్తామని కేసీఆర్‌‌ హామీ ఇవ్వడంతోనే వెంకట్రామిరెడ్డి ఐఏఎస్‌‌కు వాలంటరీ రిటైర్మెంట్‌‌ తీసుకున్నారని తెలుస్తోంది. త్వరలో ఆయనను కేబినెట్‌‌లోకి తీసుకొని రెవెన్యూ శాఖ అప్పగిస్తారని టీఆర్‌‌ఎస్‌‌ ముఖ్యులు చెప్తున్నారు.

ఎంపికలో హుజూరాబాద్‌ రిజల్ట్‌ ఎఫెక్ట్‌
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో హుజూరాబాద్‌ బైపోల్‌ రిజల్ట్‌ ఎఫెక్ట్​ కనిపించింది. కేబినెట్‌ నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్‌ చేయడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ సర్వశక్తులు ఒడ్డినా ఈటల ఘన విజయం సాధించారు. ఈటల ముదిరాజ్‌ కులానికి చెందిన నేత కావడంతో అదే కులానికి చెందిన బండ ప్రకాశ్‌ను రాజ్యసభ నుంచి వెనక్కి రప్పించారు.  రాజ్యసభ సభ్యుడిగా ఇంకో రెండేండ్లకు పైగా పదవీకాలం ఉన్నా.. ఆయనతో ఎమ్మెల్సీగా నామినేషన్‌ వేయించారు. ఈటల బర్తరఫ్​తో ఖాళీ అయిన కేబినెట్‌ బెర్త్‌ బండ ప్రకాశ్​కు ఇస్తామని సీఎం స్వయంగా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. బీసీల్లో బలమైన కులంగా ఉన్న ముదిరాజ్‌లు ఈటల వెంట బీజేపీ వైపు వెళ్లకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్‌ కులస్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. గజ్వేల్‌, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఈ కులం ప్రభావం ఎక్కువగా ఉంది. వాళ్లంతా ఈటల వెంట వెళ్తే భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయనే, ఆ కులానికి చెందిన సీనియర్‌ నేతను కేబినెట్‌లోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 2014లో వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన కడియం శ్రీహరిని ఏడాది తిరగక ముందే ఎంపీ పదవికి రాజీనామా చేయించి రాజయ్య స్థానంలో డిప్యూటీ సీఎంగా అవకాశమిచ్చారు. 

గవర్నర్‌ కోటా నుంచి ఎమ్మెల్యే కోటాలోకి
హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన కౌశిక్‌ రెడ్డి మాజీ మంత్రి ఈటల రాజీనామాతో టీఆర్‌ఎస్‌లో చేరారు. మొదట ఆయనకే హుజూరాబాద్​ ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని అనుకున్నా, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను పోటీకి దింపారు. ఈ క్రమంలో కౌశిక్‌ను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్‌ చేస్తూ ప్రతిపాదన పంపారు. ఆయనపై కేసులు ఉండటం, సోషల్‌ సర్వీస్‌ కోటాలో నామినేట్‌ చేయడంపై అభ్యంతరాలు ఉండటంతో గవర్నర్‌ ఆ ప్రపోజల్‌ను పక్కనపెట్టారు. దీంతో ఆయనను ఎమ్మెల్యే కోటాలోకి మార్చి కేసీఆర్​ అవకాశమిచ్చారు. గవర్నర్​ కోటాలో బీసీ నేతను మండలికి పంపుతారని టీఆర్​ఎస్​ నేతలు చెప్తున్నారు. మధుసూదనాచారిని నామినేట్‌ చేసే అవకాశం ఉందని, ఒకవేళ ఆయనను బండ ప్రకాశ్‌ స్థానంలో రాజ్యసభకు పంపితే.. మరొకరికి చాన్స్​ ఇవ్వొచ్చని తెలుస్తోంది.

గతంలో ముగ్గురు బీసీలు.. ఇప్పుడు ఒక్కరే
ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో గతంలో ముగ్గురు బీసీలు ఉండగా ఈసారి బండ ప్రకాశ్ ఒక్కరికి మాత్రమే చాన్స్ ఇచ్చారు. ఎస్సీల నుంచి ఇద్దరి పేర్లు ప్రచారంలో ఉన్నా.. కడియం శ్రీహరి ఒక్కరితోనే సరి పెట్టారు. ముగ్గురు రెడ్లు గుత్తా సుఖేందర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. వెలమ కులం నుంచి తక్కళ్ళపల్లి రవీందర్ రావుకు సీటు ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కడియం శ్రీహరి, బండ ప్రకాశ్, తక్కళ్ళపల్లి రవీందర్ రావు, ఉమ్మడి కరీంనగర్ నుంచి వెంకట్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డి కి చాన్స్ ఇచ్చారు.