- రెండు విభాగాల్లోనూ అమ్మాయిలదే హవా
- ఇంజినీరింగ్‌లో 156 మార్కులతో ఎం.రుషికి ఫస్ట్ ర్యాంక్
- అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో టాపర్‌గా అహ్మద్
- ఎప్‌సెట్ ఫలితాలు రిలీజ్ చేసిన కేకే, యోగితా రాణా
హైదరాబాద్, వెలుగు: టీజీ ఎప్‌సెట్–2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం జేఎన్టీయూహెచ్లో విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తదితరులతో కలిసి ప్రభుత్వ సలహాదారుకే కేశవరావు రిజల్ట్స్ రిలీజ్ చేశారు. ఇంజినీరింగ్‌లో 73.36%, అగ్రికల్చర్‌లో 86.27% మంది క్వాలిఫై అయ్యారు. ఈ ఏడాది కూడా ఎప్‌సెట్‌లో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ.. ఇలా రెండు స్ట్రీమ్స్‌లోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ శాతం క్వాలిఫై అయ్యారు. విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను, ర్యాంకు కార్డులను https://eapcet.tgche.ac.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎప్‌సెట్ కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు.
సర్కారు నిర్దేశించిన కనీస మార్కులు సాధించిన వారందరికీ ర్యాంకులు కేటాయించినట్లు తెలిపారు. కాగా, ఈ ఏడాది ఎప్‌సెట్ పరీక్ష మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌కు, మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 3,01,743 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 93.52 శాతం మంది ఎగ్జామ్స్‌కు హాజరయ్యారు. ఆయా పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఆదివారం రిలీజ్ అయ్యాయి. కార్యక్రమంలో జేఎన్టీయూ వీసీ కిషన్ కుమార్ రెడ్డి, ఎప్ సెట్ కన్వీనర్, రెక్టార్ విజయకుమార్ రెడ్డి, టీజీసీహెచ్ఈ వైస్ చైరన్లు పురుషోత్తం, మహమూద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్,
జేఎన్టీయూ రిజిస్ట్రార్వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో ఈ ఏడాది 1,97,242 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, దీంట్లో 1,44,704 మంది (73.36%) అర్హత సాధించారు. దీనిలో అమ్మాయిలు 62,291(73.72 శాతం) మంది పాస్ కాగా, అబ్బాయిలు 82,413 (73.10 శాతం) మంది ఉన్నారు. ఇక కేటగిరీల వారీగా చూస్తే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వంద శాతం అర్హత సాధించగా, ఓసీలు 73.60 శాతం, బీసీ-బీ 67.16 శాతం మంది క్వాలిఫై అయ్యారు.
అగ్రికల్చర్‌లో 86.27 శాతం పాస్
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి సంబంధించి 84,954 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 73,294 మంది (86.27%) సీటు పొందేందుకు అర్హత సాధించారు. ఇందులోనూ అమ్మాయిలు 56,320 (86.76%) మంది పాసై అగ్రస్థానంలో నిలిచారు. అబ్బాయిలు 16,973 (84.70%) మంది పాసయ్యారు. ఈ విభాగంలో ఒక ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి పరీక్ష రాయగా, వారు కూడా క్వాలిఫై అయ్యారు.
కేటగిరీల వారీగా చూస్తే..
ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో బీసీ-డీ కేటగిరీ నుంచి అత్యధికంగా 26,343 మంది, బీసీ-బీ నుంచి 28,643 మంది క్వాలిఫై అయ్యారు. ఎస్సీ కేటగిరీ నుంచి 22,625 మంది, ఎస్టీల నుంచి 14,132 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో బీసీ-డీ నుంచి 9,941 మంది, బీసీ-బీ నుంచి 9,167 మంది క్వాలిఫై అయ్యారు. ఎస్సీ కేటగిరీ నుంచి సుమారు 19,445 మంది, ఎస్టీల నుంచి 11,288 మంది పాస్ అయ్యారు.
తగ్గుతున్న గ్రాఫ్..
గత మూడేండ్ల ఫలితాలను విశ్లేషిస్తే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో క్వాలిఫై పర్సంటేజీ ఏటికేడు తగ్గుతూ వస్తున్నది. 2024లో ఈ విభాగంలో 89.67 శాతం మంది పాస్ కాగా, 2025లో 87.82 శాతానికి, ఈ ఏడాది (2026) 86.27 శాతానికి పడిపోయింది. అటు ఇంజినీరింగ్‌లో 2024లో 74.98 శాతం ఉండగా, 2025లో 73.26 శాతానికి తగ్గింది. అయితే ఈసారి స్వల్పంగా పెరిగి 73.36 శాతానికి చేరింది.
