హైదరాబాద్ : టీఎస్ ఎడ్ సెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు. టీఎస్ ఎడ్ సెట్ లో 96.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. జులై 26న జరిగిన టీఎస్ ఎడ్సెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 39 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 38,091 మంది హాజరయ్యారు.
‘బీ’ కేటగిరి (మేనేజ్మెంట్) సీట్ల భర్తీపై ..
ఇంజినీరింగ్ కాలేజీల్లో ‘బీ’ కేటగిరి (మేనేజ్మెంట్) సీట్ల భర్తీపై ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి కీలక ప్రకటన విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ను విడుదల చేసిన తర్వాతే.. బీ కేటగిరి( మేనేజ్మెంట్) సీట్లలో అడ్మిషన్లు చేయాలని ఇంజనీరింగ్ కాలేజీలకు నిర్దేశించారు. ఏ కళాశాల కానీ... యూనివర్సిటీ కానీ ప్రభుత్వం అనుమతి లేకుండా అడ్మిషన్లు చేయకూడదన్నారు. ఒకవేళ అలా అడ్మిషన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా.. షెడ్యూల్ కంటే ముందుగా అడ్మిషన్లు చేస్తే అవి చెల్లవన్నారు. కాలేజీలు ఏవైనా ముందుగా బీ కేటగిరి సీట్లు కేటాయిస్తే, వాటిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మరో మూడు రోజుల్లో బీ కేటగిరి సీట్ల భర్తీపై విధివిధానాలను ప్రకటిస్తామని లింబాద్రి పేర్కొన్నారు.

