న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్డుకు చెందిన పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 93.70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం 0.04 శాతం పాయింట్లు పెరిగింది. ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. అమ్మాయిలు 94.99 శాతం పాస్ కాగా..అబ్బాయిలు 92.60 శాతం మంది అర్హత సాధించారు. గతేడాది ఉత్తీర్ణత శాతం 93.66గా ఉండగా.. ఈసారి అది 0.04 శాతం పెరిగి 93.70 శాతంగా నమోదైంది.
ఈ ఏడాది మొత్తం 24.83లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించగా.. 24.71లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. వరిలో 23.16 లక్షల మంది స్టూడెంట్లు పాస్ అయ్యారు. పలితాల్లో కేంద్రీయ విద్యాలయాలు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయి. ఏకంగా 99.57% మంది స్టూడెంట్లు పాస్ అయ్యారు. అలాగే, జవహర్ నవోదయ విద్యాలయాలు 99.42%, ప్రైవేట్ పాఠశాలలు 93.77%, ప్రభుత్వ పాఠశాలలు 91.43%, ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లు 91.01% ఫలితాలు సాధించాయి. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు, పాఠశాల యాజమాన్యాలకు సీబీఎస్‌ఈ బోర్డు అభినందనలు తెలిపింది.

