- 100 డాలర్ల దిగువకు క్రూడాయిల్ 24,200 పైన నిఫ్టీ
- తగ్గిన ఆయిల్ ధరలు, సీజ్‌ఫైర్ ఆశలతో మార్కెట్ 1.64 శాతం అప్
- రూ.9 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద.. నిలకడగా రూపాయి
- కొనుగోలుదారులుగా మారిన ఎఫ్‌ఐఐలు
- ఈ నెలలో నిఫ్టీ 8 శాతం జూమ్
ముంబై: ఆయిల్ ధరలు తగ్గడం, ఇరాన్ యుద్ధం త్వరలో ముగియనుందనే ఆశలతో భారత స్టాక్ మార్కెట్లు బుధవారం ర్యాలీ చేశాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ 1.64 శాతం చొప్పున పెరిగాయి. సెన్సెక్స్ 1,264 పాయింట్లు పెరిగి 78,111 వద్ద ముగియగా, నిఫ్టీ 389 పాయింట్లు లాభపడి 24,231 వద్ద క్లోజ్ అయింది.
ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.9.41 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.458 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌లో ఇండిగో, ఎటర్నల్ (జొమాటో), పవర్ గ్రిడ్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్ 3–-4శాతం లాభపడి టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు భారతి ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రం స్వల్పంగా తగ్గాయి.
ఇన్వెస్టర్ల భయాన్ని కొలిచే ఇండియా విక్స్ ఇండెక్స్ 8 శాతం తగ్గి 18.76 లెవెల్‌కు దిగొచ్చింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100, మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్‌లు కూడా 2శాతానికి పైగా పెరిగాయి. ఈ ఏడాది మార్చిలో నిఫ్టీ, సెన్సెక్స్ దాదాపు 10 శాతం పతనమవ్వగా, ఈ నెలలో ఇప్పటివరకు 8 శాతం రికవర్ అయ్యాయి. కానీ, ఇంకా ఇరాన్ యుద్ధం ముందు లెవెల్ కంటే తక్కువకు ట్రేడవుతున్నాయి.
“సీజ్‌ఫైర్ ఆశలు, తగ్గుతున్న ఆయిల్ ధరలు, ఆకర్షణీయ వాల్యుయేషన్లు - ఇవి మార్కెట్‌ను బుల్లిష్‌గా మార్చాయి” అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు బుధవారం నికరంగా రూ.666 కోట్ల షేర్లు కొన్నారు. డాలర్‌తో రూపాయి 93.33 వద్ద ముగిసింది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 95 డాలర్లకు దిగొ చ్చింది.

