V6 News

పవన్ ఖేరాకు సుప్రీంలో చుక్కెదురు..తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై స్టే

పవన్ ఖేరాకు సుప్రీంలో చుక్కెదురు..తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై స్టే

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ జాతీయ మీడియా, ప్రచార విభాగం చైర్మన్ పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ హైకోర్టు ఆయనకు మంజూరు చేసిన 'ట్రాన్సిట్‌‌ ముందస్తు బెయిల్‌‌' ఆర్డర్‌‌‌‌ పై కోర్టు బుధవారం స్టే విధించింది. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ భార్య రినికి భుయాన్ శర్మకు వివిధ దేశాలకు చెందిన పాస్‌‌పోర్టులు ఉన్నాయని పవన్ ఖేరా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రినికి కంప్లైంట్ చేయడంతో గౌహతి క్రైమ్ బ్రాంచ్ పీఎస్​లో పవన్ ఖేరాపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. దీంతో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.  కోర్టు వారం రోజుల పాటు ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏప్రిల్ 10న ఉత్తర్వులు వెలువరించింది. 

ఈ ఆదేశాలపై సవాల్ చేస్తూ అస్సాం పోలీసులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై బుధవారం జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని జస్టిస్ అతుల్ ఎస్.చందుర్కర్‌‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అస్సాం పోలీసుల తరఫున  సొలిసిటర్ జనరల్ (ఎస్‌‌జీ) తుషార్ మెహతా హాజరయ్యారు. పవన్ ఖేరా ఉద్దేశపూర్వకంగా తప్పుడు పత్రాలు సమర్పించారని, చట్టాన్ని దుర్వినియోగం చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో ఈ కేసు విచారణకు సంబంధించి ప్రాదేశిక అధికార పరిధి ఎలా ఉంటుందో ఖేరా ఎక్కడా పేర్కొనలేదని వాదించారు. ఈ కేసులోని ఒక నేరానికి గరిష్టంగా పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందన్న వాస్తవాన్ని తెలంగాణ హైకోర్టు విస్మరించిందని నివేదించారు. 

ఆస్తుల చిరునామాతో విచారణ కోరలేం..

ఖేరా సమర్పించిన నోట్‌‌లో తన భార్య హైదరాబాద్‌‌లో నివసిస్తున్నట్లు చూపారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై తుషార్ మెహతా బదులిస్తూ.. "ఆమె ఆధార్ కార్డులో చిరునామా ఢిల్లీ అని ఉంది. ఒకవేళ హైదరాబాద్‌‌లో ఆస్తి ఉందన్న కారణంతో అక్కడే విచారణ జరగాలని కోరడం సరికాదు. ఇదే నిజమైతే, ఒక వ్యక్తి దేశవ్యాప్తంగా ఆస్తులు కొనుగోలు చేసి, తమకు నచ్చిన చోట ముందస్తు బెయిల్ కోరవచ్చు. 

ఇది 'ఫోరమ్ షాపింగ్' కాకపోయినా, కచ్చితంగా 'ఫోరమ్ చూజింగ్' కిందకే వస్తుంది". ఇలా చిరునామాతో విచారణ కోరలేమని వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన 'ట్రాన్సిట్‌‌ ముందస్తు బెయిల్‌‌' ఉత్తర్వులపై స్టే విధించింది. కానీ ఖేరాకు అస్సాం కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించింది. తదుపరి విచారణను   మే 13కు వాయిదా వేసింది.