- సీఎంతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్,
- పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ భేటీ
- పీసీసీ కూర్పుపైనా కొలిక్కి వచ్చిన కసరత్తు
- నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి ఓకే..
- వారం రోజుల్లో ప్రకటన
హైదరాబాద్, వెలుగు: రెండున్నరేండ్లుగా పెండింగ్ పడుతూ వస్తున్న పలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్, ఫెడరేషన్లకు చైర్‌పర్సన్ల నియామకానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొదటి విడతగా ఒకటి, రెండు రోజుల్లో 17 చేతి వృత్తుల కుల సంఘాలకు చైర్పర్సన్లను నియమించనున్నారు. ఈ మేరకు బుధవారం పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో జరిగిన సుదీర్ఘ భేటీలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు గురువారం లేదా శుక్రవారం వెలువడనున్నాయి. ఆ తర్వాత వారం రోజుల్లోనే మరికొన్ని కార్పొరేషన్లకు సంబంధించిన ఉత్తర్వులు రిలీజ్ కానున్నాయి. ఇక కీలకమైన ఆర్టీసీ, మూసీ రివర్ ఫ్రంట్‌లాంటి కార్పొరేషన్లకు సీనియర్ ఎమ్మెల్యేలను చైర్‌పర్సన్‌లుగా నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
మొదటి విడత నియామకమైన కార్పొరేషన్లు, ఫెడరేషన్లు, కమిషన్ల చైర్‌పర్సన్లు, సభ్యుల పదవీకాలం జూన్ తో ముగియనున్నందున.. వారి స్థానంలో నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న ఇతర సీనియర్లకు అవకాశం ఇవ్వాలనే అంశంపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది.
- పీసీసీ పూర్తిస్థాయి కూర్పు..
తాజా సమావేశంలో పీసీసీ పూర్తిస్థాయి కూర్పుపైనా చర్చించినట్టు సమాచారం. పీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్లతోపాటు పెండింగ్ లో ఉన్న ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, పూర్తి స్థాయి కార్యవర్గాన్ని వెంటనే నియమించాలని , ఆశావహులకు వారం రోజుల్లో గుడ్ న్యూస్ చెప్పాలని నేతలు నిర్ణయించారు. పీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా, రెడ్డి సామాజిక వర్గాలకు చోటు కల్పించనున్నారు.
ఈ పదవుల కోసం మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఎంపీ బలరాం నాయక్, గద్వాల మాజీ జడ్పీ చైర్‌పర్సన్ సరితా తిరుపతి యాదవ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్లు చర్చకు వచ్చినట్టు తెలిసింది. పీసీసీ ప్రచార కమిటీకి సైతం పలువురి పేర్లను పరిశీలించినట్టు చెప్తున్నారు. కాగా, అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్టీ కార్యకర్తలకు కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు ఇవ్వడంపైనా డిస్కస్ చేశారు. వీటిపై ఇప్పటికే ఏకాభిప్రాయం రావడంతో త్వరలోనే ఆయా కార్పొరేషన్లకు డైరెక్టర్ పదవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువడనున్నాయి.
- జగిత్యాల నియోజకవర్గంపై ప్రత్యేక చర్చ..
నేతల భేటీలో జగిత్యాల నియోజకవర్గంపై ప్రత్యేకంగా చర్చించినట్టు తెలిసింది. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడడంతో అక్కడ పార్టీ కేడర్‌ను కాపాడుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మీనాక్షి నటరాజన్ సూచించగా.. ఆ బాధ్యతలను పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కు సీఎం అప్పగించినట్టు సమాచారం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సంజయ్ వర్గంతోపాటు పాత కాంగ్రెస్ నాయకులకు కూడా నామినేటెడ్, పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పరంగా ఎలా స్పందించాలి? ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? అనే విషయం కూడా నేతల మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది.

