రిటైర్ అయినోళ్లకు పైసలిస్తలే

రిటైర్ అయినోళ్లకు పైసలిస్తలే
  • మూడు వేల మందికి అసలుకే రాలే
  • ఏదో ఒక బెనిఫిట్ ఆగినోళ్లు 25 వేల మంది.. దాదాపు రూ.2 వేల కోట్లు పెండింగ్​
  • నెలలుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రిటైర్డ్​ ఉద్యోగులు 

హైదరాబాద్, వెలుగు: పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్​మెంట్​బెనిఫిట్స్ అందక అవస్థలు పడుతున్నారు. కిందటేడాది నవంబర్, డిసెంబర్​లలో రిటైర్ అయిన వారికి కూడా ఇంతవరకు బెనిఫిట్స్ అందలేదు. దాదాపు మూడు వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు అన్ని రకాల బెనిఫిట్స్ పెండింగ్​ఉన్నట్లు ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ లెక్కలు చెప్తున్నాయి. అలాగే ఏదో ఒక బెనిఫిట్ అగిపోయిన వాళ్లు 25 వేల మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి చెల్లించాల్సిన మొత్తం దాదాపు రూ.2 వేల కోట్లు పెండింగ్ ఉన్నట్లు సమాచారం. రిటైర్​మెంట్ బెనిఫిట్స్​కు సంబంధించి చాలా వరకు ఫైళ్లు ఫైనాన్స్ డిపార్ట్​మెంట్​లోనే పెండింగ్​లో ఉన్నాయి. దీంతో ఇటు సెక్రటేరియెట్​లోని ఫైనాన్స్​డిపార్ట్​మెంట్​కు, అటు ట్రెజరీ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నరు. ప్రతి నెలా రూ.300 కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉంటుంది.  అయితే వాటిని సర్కార్ ఇతర అవసరాలకు వాడుకుంటోందనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగులు వారి శాలరీల్లో దాచుకున్న జీపీఎఫ్​నూ 2018 తర్వాత రిటైర్ అయినవాళ్లకు ఇస్తలేరు. 
మూడేళ్ల దాకా నో రిటైర్మెంట్స్ అయినా.. 
ప్రతి నెలా రాష్ట్రవ్యాప్తంగా 500 నుంచి 600 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యేవారు. ఇటీవల ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచింది. దీంతో 4 నెలలుగా రిటైర్మెంట్స్ ఆగాయి. మరో రెండున్నరేళ్ల వరకు రిటైర్మెంట్స్ ఉండవు. దీంతో ప్రభుత్వానికి ఖర్చు తగ్గింది. అయితే ఏప్రిల్ కంటే ముందు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ వస్తలేవు. గ్రాట్యుటీ, కమ్ముటేషన్​, లీవ్ ఎన్​క్యాష్​మెంట్​వంటివి అందుతలేవు.
పెన్షన్ లేట్​ చేస్తున్నరు
బెనిఫిట్స్ రాక, పెన్షన్ స్టార్ట్ గాక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నరు. ఒక ఉద్యోగి రిటైరైతే అన్ని  బెనిఫిట్స్ కలిపి మినిమమ్​రూ.40 లక్షలు వస్తుంది. ఈ బెనిఫిట్స్ క్లియర్ అయ్యాకే పెన్షన్ మొదలవుతుంది.  ప్రభుత్వం బెనిఫిట్స్ క్లియర్ చేయకపోవడంతో పెన్షన్ రాక ఇంటి, నెలవారీ ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. 
ఐదేండ్ల కిందనే సర్క్యులర్​
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్​పై 2016 డిసెంబర్​ 24 న ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం రిటైరైన ఉద్యోగికి 15 రోజుల్లో అన్ని  బెనిఫిట్స్ అందాలి. కానీ ఇప్పటి వరకు ఏ శాఖ​లోనూ ఇది అమలవట్లేదు. ఏడాది కింద మళ్లీ ఈ విషయాన్ని సీఎం అసెంబ్లీలో చెప్పినా ఆచరణలోకి రాలేదు.
‘ఫెనాన్స్​’కు ఫైల్స్ వెళ్తున్నా..
పదవీ విరమణ చేసిన ఉద్యోగికి సంబంధించిన అన్ని రకాల బెనిఫిట్స్ పై ఆయా శాఖలు ఫైల్స్ తయారు చేసి ఫైనాన్స్ డిపార్ట్​మెంట్​కు పంపుతాయి. అక్కడ ఓకే చేస్తే,  ట్రెజరీల నుంచి సంబంధిత రిటైర్డ్ ఉద్యోగి బ్యాంకు అకౌంట్​లో సొమ్ము జమ చేస్తరు. ఆయా శాఖలు రిటైర్డ్ ఉద్యోగుల బినిఫిట్స్​ఫైల్స్ సక్రమంగా పంపిస్తున్నా వాటిని క్లియర్ చేయడం లేదు. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు ట్రెజరీలు, ఫైనాన్స్ డిపార్ట్​మెంట్​ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నరు. ఫైనాన్స్ నుంచి అప్రూవల్ ఇస్తే, అకౌంట్​లో వేస్తమని ట్రెజరీ వాళ్లు, సర్కార్ ఫండ్స్ ఇస్తే అప్రూవ్ ఇస్తమని ఫైనాన్స్ వాళ్లు చెప్తూ తిప్పి పంపుతున్నరు.
15 లక్షలు ఆగిపోయాయి
ఏడు నెలల కింద రిటైర్ అయ్యాను. గ్రాట్యుటీ, జీపీఎఫ్ రూ.15 లక్షలు రావాల్సి ఉంది. వంద గజాల జాగా కొనుకున్నాను. దానికి ఇద్దామనుకుంటే టైంకు రిటైర్మెంట్ బెనిఫిట్స్​పైసలు ఇయ్యలే. అప్పు తీసుకొచ్చి కట్టాను. ఇప్పుడు దానికి ఆరు నెలల నుంచి వడ్డీ కడుతున్న.. ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ మాత్రం ఎప్పుడిస్తరో తెలుస్తలేదు.                 - రిటైర్డ్​ డిప్యూటీ తహసీల్దార్