పేపర్లు కొన్నవారి డేటా రెడీ..మరో 48 మంది అరెస్టుకు రంగం సిద్ధం

పేపర్లు కొన్నవారి డేటా రెడీ..మరో 48 మంది అరెస్టుకు రంగం సిద్ధం
  • సిట్ అదుపులో మాల్ ప్రాక్టీస్ అభ్యర్థులు!
  • కోచింగ్ సెంటర్ల అభ్యర్థుల గుర్తింపు
  • రమేశ్ ను విచారిస్తున్న అధికారులు
  • ఇప్పటి వరకు 50 మంది అరెస్టు
  • పేపర్లు కొన్నవారి డేటా రెడీ
  • సిట్ అదుపులో మాల్ ప్రాక్టీస్ అభ్యర్థులు!
  • కోచింగ్ సెంటర్ల అభ్యర్థుల గుర్తింపు
  •  రమేశ్​ను విచారిస్తున్న అధికారులు
  •  ఇప్పటి వరకు 50 మంది అరెస్టు

హైదరాబాద్‌, వెలుగు : టీఎస్‌ పీఎస్‌సీ  పేపర్ల లీకేజీ కేసులో దర్యాప్తును సిట్​ ముమ్మరం చేసింది. ఏఈ, ఏఈఈ, డీఏవో పేపర్లను కొనుగోలు చేసిన వారి డేటాబేస్‌ను తయారు చేసింది. మరో 48 మందిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వారిలో ఏఈ పేపర్‌‌  కొనుగోలు చేసిన 38 మంది అభ్యర్థులు, పది  మందికి పైగా దళారులు ఉన్నట్లు తెలిసింది. నిందితుల కాల్‌ డేటా, బ్యాంక్  ట్రాన్సాక్షన్ల ఆధారంగా సిట్  అధికారులు వివరాలు రాబట్టారు. వారి ద్వారా మరో రూ.80 లక్షల వరకు చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్‌ కుమార్‌‌, రాజశేఖర్‌ ‌రెడ్డి, రేణుకతో పాటు ఇప్పటికే 50 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ వైపు పేపర్ల లీకేజీ, మరోవైపు ఇరిగేషన్‌ ఏఈ రమేశ్  మాల్‌ప్రాక్టీస్‌ నెట్‌వర్క్​ను అధికారులు ట్రేస్  చేస్తున్నారు. ఏఈఈ, డీఏవో పరీక్షలను మాల్‌ ప్రాక్టీస్‌ చేసిన రమేశ్​ను ఆదివారం నుంచి ఆరు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారంతో అతని కస్టడీ ముగియనుండడంతో కీలక వివరాలు సేకరిస్తున్నారు. బుధవారం మాల్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన డివైజెస్‌ వివరాలతో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. రెండు పరీక్షలు రాసిన వారిలో ఇద్దరు యువతులు సహా ఏడుగురిని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సురేశ్, రమేశ్ ల ద్వారా ఏఈ పేపర్‌‌  కొనుగోలు చేసిన వారిని గుర్తించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌‌లోని కోచింగ్ సెంటర్లలో అభ్యర్థుల వివరాలు సేకరించారు. రమేశ్ కాల్‌ డేటా ఆధారంగా వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు 50 మందిని అరెస్టు చేశారు. మరో 48 మందిని అరెస్టు చేస్తే ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 98కి చేరుతుంది.

40 మంది నిందితులపై త్వరలో చార్జ్​షీట్​

ప్రధాన నిందితులు ప్రవీణ్‌ కుమార్‌, రాజశేఖర్‌ ‌రెడ్డి, రేణుక సహా మొత్తం 40 మందిపై చార్జ్​షీట్​ ఫైల్‌ చేసేందుకు సిట్‌  అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేసులో ఇరిగేషన్‌  ఏఈ రమేశ్ తో కలిపి మొత్తం 50 మందిని అధికారులు అరెస్టు చేశారు. వారిలో ప్రవీణ్‌  కుమార్‌‌, రాజశేఖర్‌  ‌రెడ్డి జైలు నుంచి విడుదల కాలేదు. రేణుక, ఆమె భర్త ఢాక్య నాయక్‌  సహా మొత్తం15 మంది బెయిల్‌పై బయటకు వచ్చారు. మొత్తం 40 మందిని అధికారులు కస్టడీకి తీసుకుని విచారించారు. వారిపై అభియోగాలు మోపేందుకు పూర్తి ఆధారాలు సేకరించారు. ఈ కేసులో రెండుకు పైగా చార్జ్​షీట్లను దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఎస్‌ పీఎస్‌సీ చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్‌, అడ్మిన్  అసిస్టెంట్‌  సెక్రటరీ సత్యనారాయణ, సెక్షన్  ఆఫీసర్  శంకరలక్ష్మితో పాటు పలువురిని సాక్షులుగా చేర్చినట్లు తెలిసింది.