T20 World Cup 2024: డిప్యూటీగా హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టు ప్రకటన

 T20 World Cup 2024: డిప్యూటీగా హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టు ప్రకటన

జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మంగళవారం(ఏప్రిల్ 30) జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన పటిష్ఠమైన జట్టును ఎంపిక చేసింది. ఈ టీమ్‌కు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు.

కారు ప్రమాద గాయాలతో దాదాపు  ఏడాదన్నర పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషబ్ పంత్.. ఈ మెగా టోర్నీ ద్వారా తిరిగి భారత జెర్సీ ధరించనున్నాడు. అలాగే, ఐపీఎల్ 2024లో అలరిస్తున్న యువ క్రికెటర్లు శివం దూబే, సంజూ శాంసన్.. ప్రపంచ కప్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. రోహిత్, యశస్వి, విరాట్, సూర్య రూపంలో భారత టాఫార్దర్ బలంగా కనిపిస్తోంది. అలాగే, జడేజా, బుమ్రా, కుల్దీప్, చాహల్, అర్షదీప్ రూపంలో బౌలింగ్‌లోనూ పటిష్టంగా ఉంది.

కాగా, జూన్ 1 నుంచి జూన్ 29 వరకు టీ20 వరల్డ్ కప్ జరగనుంది. మొత్తం 20 జట్లు ఈ టోర్నీలో  పాల్గొననున్నాయి. భారత జట్టు తన తొలి మ్యాచులో జూన్ 05న ఐర్లాండ్‌తో తలపడనుంది. 

టీ20 ప్రపంచ కప్ కు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.

స్టాండ్ బై ప్లేయర్స్: శుభ్ మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్.

టీ20 ప్రపంచ కప్‌ 2024 టీమిండియా షెడ్యూల్

  • జూన్ 05న: ఇండియా vs ఐర్లాండ్ (న్యూయార్క్)
  • జూన్ 09న: ఇండియా vs పాకిస్థాన్ (న్యూయార్క్)
  • జూన్ 12న: ఇండియా vs అమెరికా (న్యూయార్క్)
  • జూన్ 15న: ఇండియా vs కెనడా (ఫ్లోరిడా)