LSG vs MI: చేతులెత్తేసిన ముంబై బ్యాటర్లు.. లక్నో ఎదుట స్వల్ప లక్ష్యం

LSG vs MI: చేతులెత్తేసిన ముంబై బ్యాటర్లు.. లక్నో ఎదుట స్వల్ప లక్ష్యం

చావో రేవో మ్యాచ్‌లోనూ ముంబై ఇండియ‌న్స్ బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. సొంతగడ్డపై లక్నో బౌలర్లు విజృభించడంతో ముంబై టాపార్డర్ బ్యాట‌ర్లు పరుగులు చేయడానికి నానా అవస్ఠహాలు పడ్డారు. ఒక‌రివెంట మరోక‌రు పెవిలియ‌న్ క్యూ కట్టారు. అన్‌క్యాపెడ్ ప్లేయర్ నేహ‌ల్ వ‌ధేరా(46) ఒక్కడు కాసేపు పోరాడాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.

ఆ నలుగురూ విఫలం

టాస్ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియ‌న్స్ ఆరంభంలోనే క‌ష్టాల్లో ప‌డింది. స్టోయినిస్, మొహ్సిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్ త్రయం కట్టుదిట్టంగా బంతులేయడంతో 27 ప‌రుగుల‌కే 4 కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్ శ‌ర్మ(4), సూర్యకుమార్ యాద‌వ్‌(10), తిలక్ వర్మ(7), హార్దిక్ పాండ్యా(0) నలుగురూ విఫలమయ్యారు. 

ఆ సమయంలో ఇషాన్‌ కిష‌న్(32), నేహ‌ల్ వ‌ధేరా(46) జోడి ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. వీరు కుదురుకున్నారు అనుకున్న సమయాన ర‌వి బిష్ణోయ్ ఈ జోడీని విడదీశాడు. ఓ చక్కని బంతితో ఇషాన్‌ కిష‌న్(32)ను బోల్తా కొట్టించాడు. దాంతో, ముంబై 80 పరుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్(35 నాటౌట్; 18 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) ఆదిలో తడబడినా.. చివరి ఓవర్లలో విలువైన పరుగులు చేశాడు. కీలక సమయంలో వ‌ధేరా వెనుదిరగడం ముంబైని మరింత దెబ్బతీసింది. 

లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.