ఢిల్లీ అసెంబ్లీలో రహస్య సొరంగమార్గం..

ఢిల్లీ అసెంబ్లీలో రహస్య సొరంగమార్గం..

ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో రహస్య సొరంగం బయటపడింది. ఈ సొరంగం ద్వారా ఎర్రకోటకు చేరుకోవచ్చని అధికారులు గుర్తించారు. స్వాతంత్ర్య సమరయోధులను తరలించడానికి బ్రిటీషర్లు దీనని ఉపయోగించేవారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ తెలిపారు. ‘నేను 1993లో ఎమ్మెల్యే అయినప్పుడు, ఎర్రకోట వరకు వెళ్లే టన్నెల్ గురించి విన్నాను. దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాను కానీ, ఎటువంటి విషయాలు తెలియలేదు. 1912లో కోల్‌కతా నుంచి రాజధానిని ఢిల్లీకి మార్చిన తర్వాత సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఉపయోగించిన ఢిల్లీ శాసనసభను 1926లో కోర్టుగా మార్చారు. దాంతో స్వాతంత్ర్య సమరయోధులను కోర్టుకు తీసుకురావడానికి బ్రిటిషర్లు ఈ సొరంగ మార్గాన్ని ఎంచుకునేవారు. 

దేశ స్వాతంత్ర్యంతో ముడిపడి ఉన్న ఢిల్లీ శాసనసభ చరిత్రను దృష్టిలో ఉంచుకుని.. ఈ సొరంగాన్ని వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం నాటికి పర్యాటకుల సందర్శనకు సిద్దం చేయాలనుకుంటున్నాం. దానికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. శని, ఆదివారాల్లో ప్రజలను అసెంబ్లీ చూసేందుకు అనుమతిస్తాం. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు’ అని అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ తెలిపారు.