మక్కా రక్షణ ఒప్పందంలోకి ఈజిప్టు.. ఆశాభావం వ్యక్తం చేసిన తుర్కియే

మక్కా రక్షణ ఒప్పందంలోకి ఈజిప్టు.. ఆశాభావం వ్యక్తం చేసిన తుర్కియే
  • ఇప్పటికే  సంతకాలు చేసిన సౌదీ, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌

అంకారా: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కొత్తగా కుదిరిన మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంలో ఈజిప్టు చేరుతుందని తుర్కియే ఆశాభావం వ్యక్తం చేసింది. సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈజిప్టు చేరేందుకు కొన్ని సాంకేతిక, విధానపరమైన అంశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్‌‌‌‌‌‌‌‌ ఫిదాన్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. 

అమెరికా, -ఇరాన్‌‌‌‌‌‌‌‌ మధ్య యుద్ధం ప్రభావం పశ్చిమాసియాపై కొనసాగుతున్న సమయంలో ఈ ఒప్పందం కుదిరింది. హార్ముజ్‌‌‌‌‌‌‌‌ జలసంధి, ఎర్ర సముద్రంలో నౌకాయానం అంతరాయాలకు గురవుతున్న నేపథ్యంలో మూడు దేశాలు పరస్పర రక్షణకు ఈ ఒప్పందం చేసుకున్నాయి.ఈ ఒప్పందం ప్రకారం.. మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై దాడి జరిగితే, అది మిగతా రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు.

 ఐక్యరాజ్యసమితి చార్టర్‌‌‌‌‌‌‌‌లోని ఆర్టికల్‌‌‌‌‌‌‌‌ 51 ప్రకారం వ్యక్తిగత, సమష్టి ఆత్మరక్షణ హక్కును ఈ ఒప్పందం గుర్తిస్తుంది. బాహ్య దాడులను నిరోధించేలా పరస్పర నిరోధక శక్తిని పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ రక్షణ ఒప్పందం ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకుని కుదుర్చుకున్నది కాదని ఫిదాన్‌‌‌‌‌‌‌‌ స్పష్టం చేశారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఈ ఒప్పందం కీలక ముందడుగు అని పేర్కొన్నారు. మూడు దేశాలతోనే కూటమిని పరిమితం చేయకూడదని ఫిదాన్‌‌‌‌‌‌‌‌ అన్నారు. 

అవసరమైతే మరిన్ని దేశాలను ఈ రక్షణ వ్యవస్థలోకి తీసుకురావాలని తుర్కియే అధ్యక్షుడి ఆలోచనగా తెలిపారు. అమెరికా, -ఇరాన్‌‌‌‌‌‌‌‌ ఘర్షణల నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది.