ఐటీ హబ్‌లో ఈగల్ ఫోర్స్ మెరుపు దాడి.. గంజాయి కొంటూ దొరికిన 20 మంది ఐటీ ఉద్యోగులు.. లేడీ డ్రగ్ డాన్ నీతూ భాయ్ పరార్!

ఐటీ హబ్‌లో ఈగల్ ఫోర్స్ మెరుపు దాడి.. గంజాయి కొంటూ దొరికిన 20 మంది ఐటీ ఉద్యోగులు.. లేడీ డ్రగ్ డాన్ నీతూ భాయ్ పరార్!

హైదరాబాద్ ఐటీ హబ్‌లో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఐటీ కారిడార్‌ను వణికిస్తున్న లేడీ డ్రగ్ డాన్ నీతూ భాయ్ అడ్డాపై అధికారులు మెరుపు దాడి చేశారు. నానక్‌రామ్‌గూడను కేంద్రంగా చేసుకుని, పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు జరుపుతున్న నీతూ భాయ్ కోసం ఈగల్ ఫోర్స్ రంగంలోకి దిగింది. అయితే అధికారుల ఎంట్రీ సమాచారం ముందే లీక్ అవ్వడంతో డ్రగ్ డాన్ నీతూ భాయ్ అక్కడి నుంచి పరారైంది. ప్రస్తుతం ఆమె కోసం ఈగల్ ఫోర్స్ నానక్‌రామ్‌గూడలోనే మకాం వేసి వేట కొనసాగిస్తోంది.

ధూల్‌పేట్ నుంచి వచ్చి ఐటీ కోర్ ఏరియాలో అడ్డా పెట్టిన ఈ నీతూ భాయ్.. బయటికి మాత్రం ఓ సాధారణ కిరాణం షాపు నడుపుతున్నట్టు కలరింగ్ ఇస్తోంది. కానీ ఆ షాపు మాటున రోజుకు ఐదు నుంచి పది లక్షల రూపాయల వరకు గంజాయి వ్యాపారం సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గతంలోనే ఈమెను అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు. అయినా బుద్ధి మారని నీతూ భాయ్.. జైలు నుంచి బయటకు రాగానే మళ్లీ అదే దందాను మొదలుపెట్టింది.

►ALSO READ | ఉద్యోగుల ప్రతి కమ్యూనికేషన్ ఏఐతో ట్రాక్ చేస్తున్న కాగ్నిజెంట్.. రూ.1900 కోట్ల బిజినెస్ సీక్రెట్!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే టార్గెట్‌గా ఈ గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. నీతూ భాయ్ ఇంటికి గంజాయి కొనుగోలు కోసం ఐటీ ఎంప్లాయిస్ క్యూలు కట్టడం కలకలం రేపుతోంది. ఈగల్ ఫోర్స్ జరిపిన మెరుపు తనిఖీల్లో.. కేవలం ఒక్క గంట వ్యవధిలోనే గంజాయి కొనేందుకు వచ్చిన 20 మంది ఐటీ ఉద్యోగులను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నీతూ భాయ్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.