డెస్క్ జర్నలిస్టులకు, చిన్నపత్రికలకు అక్రెడిటేషన్లు పెంచాలి :  టీడబ్ల్యూజేఎఫ్

డెస్క్ జర్నలిస్టులకు, చిన్నపత్రికలకు అక్రెడిటేషన్లు పెంచాలి :  టీడబ్ల్యూజేఎఫ్
  • సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ కు టీడబ్ల్యూజేఎఫ్ వినతి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా చిన్న పత్రికలకు, డెస్క్​ జర్నలిస్టులకు అక్రెడిటేషన్  కార్డులు పెంచాలని తెలంగాణ వర్కింగ్  జర్నలిస్ట్స్  ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్  చేసింది. సోమవారం హైదరాబాద్‌‌‌‌లో సమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్  కమిషనర్  ముకుందరెడ్డిని ఫెడరేషన్ ప్రతినిధులు కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

ప్రింటింగ్  కేంద్రాల్లోనే కాకుండా, జిల్లా కేంద్రాల్లో పనిచేసే డెస్క్  జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్  కార్డులు కేటాయించాలని కోరారు. డెస్క్  జర్నలిస్టుల విధులు, బాధ్యతల గురించి వారికి వివరించారు. చిన్న పత్రికలకు ఉమ్మడి జిల్లాలవారీగా పబ్లికేషన్  కేంద్రాల్లో, నియోజకవర్గానికి రెండు చొప్పున అక్రిడిటేషన్  కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అక్రెడిటేషన్ల జీఓను సవరించి చిన్న పత్రికల జర్నలిస్టులకు, డెస్క్  జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు. అక్రెడిటేషన్  కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, త్వరగా జర్నలిస్టులకు కార్డులు అందించాలన్నారు.

మరోపక్క జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డుల అంశంపై కమిషనర్‌‌‌‌తో చర్చించారు. ఇప్పటికే ఈ సమస్యలను సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని గుర్తుచేశారు. ఆయనను కలిసిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవ పున్నయ్య, ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ, బి.రాజశేఖర్, కార్యదర్శులు చంద్రశేఖర్, నవీన్  తదితరులు ఉన్నారు.