న్యూఢిల్లీ: అది ఢిల్లీలోని ప్రఖ్యాత కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్. ఆదివారం అక్కడికి ప్రాక్టీస్ చేయాడానికి వచ్చిన ఇద్దరు షూటర్లు.. షూటింగ్ బదులు ఫైటింగ్ మొదలు పెట్టారు. పక్కనే నేషనల్ క్యాంప్ జరుగుతున్నా.. ఇతర ఫైరింగ్ పాయింట్లలో షూటర్లు ప్రాక్టీస్ కొనసాగిస్తున్నా లెక్కచేయకుండా ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. ప్రాక్టీస్‌లో ఒకరి తర్వాత ఎన్ని రౌండ్లు షూట్ చేయాలన్న విషయంలో ఆ ఇద్దరి మధ్య ఏర్పడ్డ ఈ గొడవ షూటింగ్ రేంజ్‌నే హడలెత్తించింది. పక్కనే ఉన్న షూటర్లు, కోచ్‌లు వారిద్దరినీ కష్టపడి విడదీసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ గొడవలో పాల్గొన్న బాబర్ ఖాన్, యోగిందర్ పాల్ సింగ్ అనే ఇద్దరు షూటర్ల ‘పే అండ్ ప్లే’మెంబర్‌షిప్‌ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) రద్దు చేసింది. అలాగే, ఈ ఘటనపై నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) విచారణకు ఆదేశించింది. దాన్ని తమ అథ్లెటిక్స్ కమిషన్‌కు అప్పగించింది. కాగా, టీనేజ్ వయసున్న కొడుకుతో కలిసి బాబార్ ఖాన్ ప్రాక్టీస్ చేస్తుండగా, యోగిందర్ ఫుల్ టైమ్ ప్రైవేట్ కోచ్ కావడం గమనార్హం.


