- మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కుదిరిన ఎంవోయూ
- రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు శిక్షణ
- ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో 3 నెలల కోర్సులు
హైదరాబాద్, వెలుగు: యువతను భవిష్యత్ సాంకేతిక రంగానికి అనుగుణంగా తీర్చిదిద్ది, వారికి ఉపాధి–ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. పరిశ్రమల అవసరాలకు తగ్గ నైపుణ్యాలను విద్యార్థులకు అందించి, నేరుగా కొలువులతో అనుసంధానించేందుకు ప్రతిష్టాత్మక 'ఉడాన్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, ప్రముఖ ఐటీ దిగ్గజం డెల్ టెక్నాలజీస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
సెక్రటేరియెట్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఎంవోయూను టాస్క్, డెల్ సంస్థలు మార్చుకున్నాయి. ఉడాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసే 25 ప్రత్యేక శిక్షణా కేంద్రాల ద్వారా తొలి విడతలో 5,500 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
3 నెలల పాటు సాగే ఈ స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్, డిజిటల్ స్కిల్స్ వంటి భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే ఎమర్జింగ్ టెక్నాలజీలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కేవలం నగరాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత, విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చి వారిలో పరిశ్రమలకు అవసరమైన ఉపాధి నైపుణ్యాలు పెంపొందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఐఐటీ ఢిల్లీ సిలబస్.. డెల్ సాంకేతిక సాయం
ఈ ప్రోగ్రామ్ కోసం సిలబస్‌ను ఐఐటీ ఢిల్లీ రూపొందించగా, శిక్షణకు కావాల్సిన పూర్తి సాంకేతిక సహకారాన్ని డెల్ టెక్నాలజీస్ సమకూరుస్తోంది. జాతీయ స్థాయిలో డెల్ టెక్నాలజీస్, ఎఫ్ఐటీటీ–ఐఐటీ ఢిల్లీ, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్, జనరేషన్ ఇండియా ఫౌండేషన్లు సంయుక్తంగా ఈ ఉడాన్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాయి. మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో పరిశ్రమల ప్రస్తుత, భవిష్యత్ డిమాండ్లకు అనుగుణంగా స్థానిక యువతకు అత్యుత్తమ శిక్షణ అందేలా వ్యవస్థను రూపకల్పన చేశారు.
ఎంతమందికి సర్టిఫికెట్లు ఇచ్చామనే గణాంకాలకే పరిమితం కాకుండా, శిక్షణ పొందిన యువతలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? వారికి ఎలాంటి ఉపాధి దక్కింది? అనే కొలమానాల ఆధారంగా టాస్క్ పని చేస్తుందని అధికారులు తెలిపారు. ఒక బలమైన 'ట్రైనింగ్-టు-ఎంప్లాయ్‌మెంట్' ఎకోసిస్టమ్‌ను నిర్మించడమే లక్ష్యంగా టాస్క్ అడుగులు వేస్తోందన్నారు.
చదువుతో పాటే కొలువుల బాట
సాధారణంగా డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఉద్యోగాల కోసం కోర్సులు చేయడం, నైపుణ్యాలు నేర్చుకోవడం పరిపాటిగా మారింది. కానీ ఈ పాత పద్ధతికి స్వస్తి పలికి విద్యార్థి దశలోనే ఇండస్ట్రీకి సిద్ధం చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉడాన్‌ను తీసుకొచ్చింది. ఉద్యోగం / అప్రెంటిస్‌షిప్ / ఎంట్రప్రెన్యూర్‌షిప్ అనే చైన్ ద్వారా విద్యార్థులను తీర్చిదిద్దనుంది. సాంకేతిక నైపుణ్యాలతో పాటు ప్రాక్టికల్ అనుభవం, జాబ్-రెడీనెస్‌పై విద్యార్థులకు గైడెన్స్ ఇచ్చి ఉద్యోగాలు సాధించేలా లేదా సొంతంగా స్టార్టప్‌లు, వ్యాపారాలు ప్రారంభించేలా ప్రోత్సహిస్తారు.
