అమానవీయ ఘటన..రూ.2వేల అద్దె కట్టలేక..భార్య, కూతురిపై అత్యాచారానికి ఇంటిఓనర్ తో భర్త ఒప్పందం

అమానవీయ ఘటన..రూ.2వేల అద్దె కట్టలేక..భార్య, కూతురిపై అత్యాచారానికి ఇంటిఓనర్ తో  భర్త ఒప్పందం

గుజరాత్ లో ఇంటి అద్దె చెల్లించలేక భార్య బిడ్డలను తాకట్టు పెట్టాడు ఓ వ్యక్తి. 2వేల రూపాయల అద్దెకు బదులుగా భార్య, కన్న కూతురిపై అత్యాచారానికి ఇంటి ఓనర్ తో ఓ వ్యక్తి ఒప్పందం కుదుర్చుకున్న అమానవీయ ఘటన గుజరాత్ లోని మోర్బిలో చోటు చేసుకుంది. బాధిత మహిళ తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. అద్దె చెల్లించలేక, భార్యపైనా, మైనర్ కుమార్తెపైనా ఇంటి యజమాని పదేపదే అత్యాచారం చేసేందుకు ఒప్పందం చేసుకున్నాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిని అరెస్టు చేసి కటకటాల్లో పెట్టారు పోలీసులు

పోలీసుల కథనం ప్రకారం..గుజరాత్‌లోని సురేంద్రనగర్‌కు చెందిన ఆ కుటుంబం జీవనోపాధి కోసం సుమారు ఆరు నెలల క్రితం మోర్బికి వచ్చింది. వారికి నెలకు రూ. 2,000 అద్దెతో ఉండేందుకు ఇల్లు దొరికింది. అయితే, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆ కుటుంబం నాలుగు నెలల అద్దె చెల్లించలేకపోయారు. అయితే అద్దెకు బదులుగా తన భార్య, కూతురిపై అత్యాచారం చేసేందుకు ఇంటి ఓనర్ తో భర్త ఒప్పందం చేసుకున్నాడు. 

ఈ విషయం బాధితురాలి తల్లికి తెలియడంతో ఆమె మోర్బి పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఇంటి ఓనర్, బాధితురాలి భర్తపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఉన్న మరో వ్యక్తికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.