టీఆర్టీ కోసం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడి

టీఆర్టీ కోసం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడి

హైదరాబాద్, వెలుగు: టీచర్ పోస్టుల భర్తీ కోసం టీఆర్టీ నోటిఫికేషన్​ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ వచ్చే లోపే నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్​ను ముట్టడించారు. ఏజీ ఆఫీస్ నుంచి వందల మంది ర్యాలీగా వెళ్లి.. డైరెక్టరేట్ వద్ద బైఠాయించారు. వర్షం పడుతున్నా ఆందోళన ఆపలేదు. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు వచ్చి తమ వినతిపత్రం తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. 

అధికారులెవరూ రాకపోవడంతో ఆఫీసులోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు నిరుద్యోగులను పోలీసులు  అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రాంమోహన్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో15 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం ఇంతవరకూ నోటిఫికేషన్ ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రంలో 4 లక్షల మంది అభ్యర్థులు టీఆర్టీ కోసం ఎదురుచూస్తున్నారని వివరించారు. టెట్ నోటిఫికేషన్​తో పాటు టీఆర్టీ నోటిఫికేషన్ జారీచేయాలని డిమాండ్ చేశారు.