అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్

అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు :  కేటీఆర్

పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతంగా పని చేసిన బీఆర్ఎస్ శ్రేణులకు సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే  కేటీఆర్‌.  అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పోరాటం అంత సులువు కాదన్న కేటీఆర్..  కేసీఆర్‌ కు  అండగా నిలవడంతో అద్భుత ధైర్యాన్ని  ప్రదర్శించారని కొనియాడారు.  క్లిష్టమైన యుద్ధంలో అద్భుతంగా పోరాడిన అందరికి ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.  

 

అచంచలమైన విశ్వాసంతో తమ పార్టీ కార్యకర్తలు ఈ ఎన్నికల్లో తమ వాణిని బలంగా వినిపించి, అద్భుతంగా కొట్లాడారన్నారన్నారు కేటీఆర్.  తమ పార్టీ శ్రేణులు చేసిన ఈ పోరాటం గొప్ప ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.  పార్టీ శ్రేణులతో పాటు తమ వెంట నిలిచిన తెలంగాణ ప్రజలందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. 

అటు సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సైతం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.  ఎంపీ అభ్యర్థులను గెలిపించేందుకు నిర్విరామంగా కృషి చేశారని కొనియాడారు.  పార్టీ గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని అన్నారు.  అంకితభావంతో మీరు పడిన కష్టం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పుకొచ్చారు.