యువ శక్తితో వికసిత్ భారత్

యువ శక్తితో వికసిత్ భారత్
  • లోక్​సభలో 2026 - 27 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ 
  • వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
  • సుమారు 83 నిమిషాల పాటు సాగిన ప్రసంగం
  • తొలిసారి ఆదివారం రోజున కేంద్ర బడ్జెట్
  • ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తం.. ప్రతి వర్గానికీ అవకాశాలు అందేలా చూస్తామని వెల్లడి

న్యూఢిల్లీ: యువ శక్తితో దేశాన్ని ‘వికసిత్ భారత్’ దిశగా నడిపించడమే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్​సభలో కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్​ను ప్రవే శపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డ్ క్రియేట్ చేశారు. 75 ఏండ్ల సంప్రదాయాలకు తెర దించుతూ తొలిసారిగా ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టారు. ‘‘హానరబుల్ స్పీకర్.. పవిత్రమైన మాఘ పూర్ణిమ, గురు రవిదాస్ జయంతి రోజున 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను నేను కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెడుతున్నాను” అంటూ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మల.. దాదాపు 83 నిమిషాల పాటు బడ్జెట్ స్పీచ్ ను చదివారు.

దేశంలోని యువ శక్తిని ముందుకు నడిపించే దిశగా ఈ బడ్జెట్​కు రూపకల్పన చేశామని ప్రకటించారు. పేదరిక నిర్మూల న, దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరు గుపర్చడం, సంస్కరణలే లక్ష్యంగా చర్యలు చేపట్టామని వెల్లడించారు. కర్తవ్య భవన్ (కామన్ సెంట్రల్ సెక్రటేరియెట్)లో రూపుది ద్దుకున్న తొలి బడ్జెట్ ఇది అని, మూడు కర్త వ్యాలే పునాదులుగా ఈ బడ్జెట్​ను ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు.

ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం..  నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంచుకోవాలన్న ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం.. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ విజన్​లో భాగంగా ప్రతి కుటుంబం, ప్రతి కమ్యూనిటీ, ప్రతి ప్రాంతం, ప్రతి రంగానికి వనరులు, కనీస సౌలతులు, అవకాశాలను కల్పించాలన్న మూడు కర్తవ్యాల ప్రాతి పదికగా బడ్జెట్​ను రూపొందించామని వివరించారు. ఖాదీ, హ్యాండ్లూమ్, హ్యాండిక్రాప్ట్స్​ను బలోపేతం చేయడం కోసం మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు నిర్మల ప్రకటించారు. టెక్స్ టైల్ రంగానికి నేషనల్ ఫైబర్ స్కీమ్, నేషనల్ హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ కార్యక్రమం కింద మెగా టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. 

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు బూస్ట్ 

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా భవిష్యత్తు చాంపియన్ ఎస్ఎంఈలను సృష్టించాలన్న లక్ష్యంతో ప్రత్యేకంగా రూ. 10 వేల కోట్లతో ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ ను కేటాయించనున్నట్టు బడ్జెట్ స్పీచ్ లో నిర్మల ప్రకటించారు. దేశంలో బయో ఫార్మా అభివృద్ధి కోసం ఐదేళ్ల కాలానికి గాను బయోఫార్మా శక్తి కార్యక్రమం కింద రూ. 10 వేల కోట్లు కేటాయిస్తామని తెలిపారు.

కొత్తగా మూడు నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థలు ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే ఉన్న 7 సంస్థలను అప్ గ్రేడ్ చేస్తామన్నారు. మైనింగ్, ప్రాసెసింగ్, రీసెర్చ్, మాన్యుఫాక్చరింగ్​ను ప్రోత్సహించడం కోసం మూడు ప్రత్యేక కెమికల్ పార్కులు ఏర్పాటు చేస్తా మన్నారు. విద్యుత్, స్టీల్, సిమెంట్, రిఫైనరీస్, కెమికల్స్ రంగాల్లో కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్, స్టోరేజ్ కోసం ఐదేండ్లలో రూ.20 వేల కోట్లు కేటాయించనున్నట్టు పేర్కొన్నారు.

బడ్జెట్‌‌‌‌ ప్రసంగానికి కాంచీపురం చీరలో..

బడ్జెట్‌‌‌‌ వేళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌‌ ఈసారి హ్యాండ్లూమ్‌‌‌‌ శారీని ఎంచుకున్నారు. దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని, హుందాతనాన్ని ప్రతిబింబించేలా తమిళనాడు కాంచీపురం చీరను ధరించారు. బంగారు, కాఫీ వర్ణం అంచుతో ఉన్న మెజెంటా రంగు చీర, గోల్డెన్‌‌‌‌ కలర్‌‌‌‌ బ్లౌజ్‌‌‌‌, శాలువాతో కన్పించారు. కొన్ని నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆమె కాంచీపురం చీరను ఎంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఏటా బడ్జెట్‌‌‌‌ రోజున ధరించే చీరల విషయంలో స్పెషల్ ఉండేలా నిర్మల చూసుకుంటున్నారు.  

9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ ప్రసంగంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. 2019 నుంచి 2026 వరకు ఆమె మొత్తంగా 14 గంటలు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఆమె తాజాగా ప్రవే శపెట్టిన కేంద్ర బడ్జెట్ తొమ్మిదోదికాగా..గతంలో మొరార్జీ దేశాయ్ 10 సార్లు బడ్జెట్‌‌‌‌ను ప్రవేశపెట్టారు. అయితే ఆయన వేరు వేరు ప్రధాన మంత్రుల హయాంలో పద్దులు ప్రవేశపెట్టారు. మొత్తంగా 9 వరుస బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ రికార్డ్ క్రియేట్ చేశారు.

15 వేల స్కూళ్లలో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్​లు 

దేశవ్యాప్తంగా15 వేల స్కూళ్లు, 500 కాలేజీల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్​ల ఏర్పాటు కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్​కు మద్దతు ఇస్తామని నిర్మల ప్రకటించారు. ప్రధాన ఇండస్ట్రియల్, లాజిస్టిక్ కారిడార్​ల సమీపంలో 5 యూనివర్సిటీ టౌన్ షిప్​ల ఏర్పాటుకు కూడా మద్దతు ఇస్తామని తెలిపారు. వచ్చే దశాబ్దకాలంలో స్పోర్ట్స్ సెక్టార్​ను సమూలంగా మార్చివేసే దిశగా ఖేలో ఇండియా మిషన్ ప్రారంభిస్తామని వెల్లడించారు.  

ఎమర్జెన్సీ, ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుతో ఎమర్జెన్సీ సర్వీసులను బలోపేతం చేస్తామని.. జిల్లా హాస్పిటల్స్ సామర్థ్యాన్ని 50 శాతం మేరకు పెంచుతామన్నారు. ఇండియా నుంచి డేటా సెంటర్లు నిర్వహిస్తూ, అంతర్జాతీయ కస్టమర్లకు క్లౌడ్ సర్వీసులు అందిస్తున్న విదేశీ కంపెనీలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే ప్రకటించారు. ఇన్ కం ట్యాక్స్ విధానంలో ఎలాంటి మార్పు లేదని, రివైజ్డ్ ట్యాక్స్ రిటర్నుల దాఖలుకు గడువును మార్చి 31 వరకూ పెంచుతున్నామని పేర్కొన్నారు.