రైల్వేకు రూ.2.78 లక్షల కోట్లు..రైల్వే రంగం రూపు రేఖలు మార్చే బడ్జెట్: మంత్రి అశ్వినీ వైష్ణవ్

రైల్వేకు రూ.2.78 లక్షల కోట్లు..రైల్వే రంగం రూపు రేఖలు మార్చే బడ్జెట్: మంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ: రైల్వే శాఖకు బడ్జెట్​లో ఈసారి రూ.2.78 లక్షల కోట్లు కేటాయించారు. మూలధన వ్యయాన్ని రూ.2.93 లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. బడ్జెట్ అనంతరం మీడియాతో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్  మాట్లాడారు. ఇది రైల్వే రంగం రూపురేఖలను మార్చే బడ్జెట్  అని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ఈసారి ఏడు హైస్పీడ్  రైల్  కారిడార్లతో పాటు ఒక డెడికేటెడ్  ఫ్రైట్ కారిడాన్ ను కూడా ప్రకటించారని ఆయన తెలిపారు.

 ప్రజలకు ఇదొక వరమన్నారు. క్యాపిటల్  ఎక్స్ పెండిచర్  రూ.2.93 లక్షల కోట్లలో రూ.1.20 లక్షల కోట్లను ప్యాసింజర్, ఆపరేషనల్  సేఫ్టీని మరింత మెరుగుపరచడానికి ఖర్చు చేస్తామని తెలిపారు. ‘‘ప్రయాణికుల భద్రతపై రైల్వే ఎప్పుడూ ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఇటీవలి కాలంలో యాక్సిడెంట్లను 95 శాతం తగ్గించాం. 

ట్రాక్స్, లొకొమోటివ్స్, వాగన్లు, కోచ్ లను రాపిడ్  కవచ్, సీసీటీవీ కెమెరాలు, ఓవర్ హెడ్  ఎలక్ట్రికల్  ఎక్విప్ మెంట్  ద్వారా మెయింటెన్  చేసి మరింత పకడ్బందీగా భద్రతా చర్యలు తీసుకుంటాం. అలాగే, రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తాం. ఇక ముంబై–పుణె, పుణె–హైదరాబాద్, హైదరాబాద్–చెన్నై, చెన్నై–బెంగళూరు, ఢిల్లీ–వారణాసి, వారణాసి–సిలిగురి మధ్య హైస్పీడ్  కారిడార్లకు నిర్మల ప్రతిపాదనలు చేశారు. దీంతో రవాణా రంగం మరింత ఊపందుకుంటుంది” అని వైష్ణవ్  పేర్కొన్నారు.

ఆ కారిడార్లతో ప్రయాణ సమయం భారీగా ఆదా

దక్షిణ భారతంలో చెన్నై–బెంగళూరు–హైదరాబాబాద్  కారిడార్ తో కేరళ, కర్నాటక, ఏపీ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు లబ్ధి కలుగుతుందని అశ్వినీ వైష్ణవ్  తెలిపారు. ఈ కారిడార్ తో చెన్నై–బెంగళూరు మధ్య ప్రయాణ సమయం ఒక గంట 13 నిమిషాలకు,  బెంగళూరు–హైదరాబాద్  మధ్య 2 గంటలకు, చెన్నై–హైదరాబాద్  మధ్య 2.55 గంటలకు తగ్గుతుందని వివరించారు. ముంబై–పుణె హైస్పీడ్  కారిడార్ తో ప్రయాణ సమయం 48 నిమిషాలకు తగ్గుతుందన్నారు. 

పుణె–హైదరాబాద్  కారిడార్ తో జర్నీ గంట 55 నిమిషాలకు తగ్గుతుందని పేర్కొన్నారు. ఇక నార్త్ లో ఢిల్లీ–వారణాసి కారిడార్ తో జర్నీ టైమ్  3 గంటల 50 నిమిషాలకు తగ్గుపోతుందన్నారు. వారణాసి–పాట్నా–సిలిగురి కారిడార్ తో 2.55 గంటల్లోనే ఆ నగరాల మధ్య జర్నీ చేయవచ్చన్నారు. 4 వేల కిలోమీటర్లలో ఏడు కారిడార్లను నిర్మిస్తామని, రూ.16 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడించారు. దీనితో పాటు ప్యాసింజర్  భద్రతను మరింత పెంచుతామన్నారు.