ఈ- గవర్నెన్స్‌‌‌‌లో తెలంగాణ భేష్!..కేంద్ర కేబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్

ఈ- గవర్నెన్స్‌‌‌‌లో తెలంగాణ భేష్!..కేంద్ర కేబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ, పాలనలో సంక్లిష్టతలను తొలగించి ‘సింపుల్ ఈ-గవర్నెన్స్‌‌‌‌’ దిశగా అడుగులు వేయాలని కేంద్ర కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టి.వి. సోమనాథన్ రాష్ట్రాలను ఆదేశించారు. సోమవారం వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సింపుల్‌‌‌‌ గవ్’  తరహా విధానాలను అధ్యయనం చేసి, స్థానిక నిబంధనలకు అనుగుణంగా పౌర సేవలను మరింత సులభతరం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న డిజిటల్ విధానాలను రాష్ట్ర సీఎస్ కె. రామకృష్ణారావు వివరించగా, మున్సిపల్, రెవెన్యూ, పరిశ్రమలు, విద్య తదితర శాఖల్లో ఆన్‌‌‌‌లైన్ డ్యాష్‌‌‌‌ బోర్డుల ద్వారా సాగుతున్న పారదర్శక పాలనను కేంద్ర సెక్రటరీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, సాంకేతికత సాయంతో క్షేత్రస్థాయి వరకు మెరుగైన సేవలు అందించేలా మరిన్ని మార్పులు చేపడతామని ఈ సందర్భంగా సీఎస్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్, ముఖ్య కార్యదర్శులు శికా గోయల్, యోగితా రాణా సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.