సుప్రీం కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చండి : కేంద్ర మంత్రి

సుప్రీం కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చండి : కేంద్ర మంత్రి

న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు కొలిజియంలో ప్రభుత్వ ప్రతినిధులను కూడా స్థానం కల్పించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కు  లేఖ రాశారు. జడ్జీల నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం అవసరమని అందులో పేర్కొన్నారు. 

ఇటీవల కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సుప్రీంకోర్టు కొలిజీయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ కార్యకలాపాలు పారదర్శకంగా లేవని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయమూర్తులు కేసుల తీర్పులు చెప్పడం మాని సగం సమయాన్ని జడ్జీలుగా ఎవరిని నియమించాలన్న అంశంపైనే వృథా చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌..  2014లో  నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్‌   ( NJAC) ని సుప్రీంకోర్టు రద్దు చేసిందంటూ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదిరింది.

ఇదిలా ఉంటే కిరణ్ రిజిజు లేఖపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ నిర్ణయం ప్రమాదకరమని న్యాయవ్యవస్థ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చిన కేంద్రమంత్రి రిజిజు.. కేజ్రీవాల్  కోర్టు ఆదేశాలను గౌరవిస్తారనంటూ సటైరిక్ ట్వీట్ చేశారు.