భార్యతో అసహజ పద్దతుల్లో శృంగారం నేరం కాదు: హైకోర్టు

భార్యతో అసహజ పద్దతుల్లో శృంగారం నేరం కాదు: హైకోర్టు

భార్యాభర్తల శృంగార జీవితంపై న్యాయస్థానాలు వెల్లడిస్తున్న తీర్పులు సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నాయో అంతుపట్టడం లేదు. చట్టాలు అనుకూలంగా ఉండటంతో.. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కోర్టు మెట్లెక్కుతూ తమ సంసార జీవితాన్నినడివీధికి చేరుస్తున్నారు. దంపతులు ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారనో లేదా ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకున్నారనో.. ఇప్పటివరకూ భార్యాభర్తలు కోర్టు మెట్లెక్కడం చూసుంటాం.. అందుకు ఇది విభిన్నమైన కేసు. పెళ్లైన మహిళ.. భర్త తనపై అసహజ శృంగారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు(ఎఫ్ఐఆర్ నమోదు) చేసింది. ఈ కేసు న్యాయస్థానం ముందుకు రాగా.. సంచలన తీర్పు వెలువడింది. 

అసలేంటి ఈ కేసు..? 

ఈ కేసు 2019 నాటిది. నివేదికల ప్రకారం.. జూన్ 6 - 7, 2019న మధ్య రాత్రి భర్త తనతో అసహజ శృంగారానికి పాల్పడ్డారని ఓ భార్య తన భర్తపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. వివాహం అనంతరం భర్త రెండవ సారి తన ఇంటికి వచ్చినప్పుడు, అనేక సందర్భాల్లో తనతో అసహజ లైంగిక చర్యలకు పాల్పడ్డాడని ఆరోపించింది. దీనిని సవాలు చేస్తూ ఆమె భర్త హైకోర్టును ఆశ్రయించారు. తాము దంపతులం కావున తన భార్యతో అసహజ శృంగారం ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం నేరం కాదని వాదించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించారు.

ఈ కేసుపై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం చట్టబద్ధంగా పెళ్లైన భార్యతో భర్త అసహజ శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారంగా పరిగణించబడదని తీర్పిచ్చింది. అలాంటి సందర్భంలో భార్యను వివాహం చేసుకున్నందున ఆమె సమ్మతి ముఖ్యం కాదని తీర్పు వెలువరించింది. భారతదేశంలో 'మారిటల్ రేప్'ను ఇంకా నేరంగా గుర్తించలేదని న్యాయమూర్తి జస్టిస్ జీఎస్ అహ్లూవాలియా విచారణ సందర్బంగా వ్యాఖ్యానించారు. కనుక జబల్పూర్, కొత్వాలి పోలీస్ స్టేషన్ లో నమోదైన క్రైమ్ నెం.377/2022లో ఎఫ్ఐఆర్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ ను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. అదే సమయంలో వేరుగా నివసిస్తున్న భార్యతో లైంగిక చర్యకు పాల్పడడం అత్యాచారంగా పరిగణిస్తామని కోర్టు తెలిపింది.