న్యూఢిల్లీ: చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు వ్యతిరేకించారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ తెలిపారు. ఇండియా కూటమి సభ్యులు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామని చెబుతూనే.. కానీ, అయితే అంటూ వ్యతిరేకించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.. కానీ ప్రతిపక్షాలు వ్యతిరేకించింది డీలిమిటేషన్ బిల్లును కాదు మహిళా రిజర్వేషన్ బిల్లునే అని కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలది మహిళా వ్యతిరేక మైండ్ సెట్ అని విమర్శించారు. 2029 లోక్ సభ ఎన్నికలకు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లతో వెళ్లాలని ప్రధాని మోడీ భావించారన్నారు. డీలిమిటేషన్‌ను వ్యతిరేకించడం అంటే ఎస్సీ, ఎస్టీలను వ్యతిరేకించడమేనని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్లకు ప్రతిపక్షాలు వ్యతిరేకమని ఆరోపించారు. లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై చర్చకు కేంద్ర మంత్రి అమిత్ షా శుక్రవారం (ఏప్రిల్ 17) సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ మూడు బిల్లులపై లోక్ సభలో సమగ్రంగా చర్చ జరిగింది. సభలో అన్ని పార్టీలు తమ వాదనను వినిపించాయి. 130 మంది ఎంపీలు తమ అభిప్రాయాలు చెప్పారు. 56 మంది మహిళా ఎంపీలు దీనిపై మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లును ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు వ్యతిరేకించారని ఆరోపించారు.
1971లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది.. ఆ తర్వాత ఇప్పటి వరకు జరగలేదు. ప్రస్తుత లోక్ స్థానాల్లో తీవ్ర వ్యత్యాసం ఉంది. ఒక స్థానంలో లక్షల్లో ఓటర్లు ఉన్నారు. మరో చోట వేలల్లోనే ఉన్నారు. లక్షల మంది ఓటర్లను సమస్యలను ఒక ఎంపీ పరిష్కరించగలరు. అందుకోసమే డీలిమిటేషన్ చేసి నియోజకవర్గాల ఓటర్లలో సమతూకం సాధనకు ప్రయత్నాస్తున్నాం. ఒక ఎంపీ తన విధులు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది తోడ్పడుతుంది. కానీ డీలిమిటేషన్ ను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. జనభా లెక్కలను డీలిమిటేషన్ కు ముడి పెట్టొద్దని అంటున్నాయి. కానీ జనాభా లెక్కలను డీలిమిటేషన్‌కు మేం లింక్ పెట్టలేదు.
జనగణనను నియోజకవర్గాల పునర్విభజనకు ముడి పెట్టింది కాంగ్రెస్సే. ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ కావాలనే డీలిమిటేషన్‌ను ఆపింది. ఇప్పుడు విపక్షంలో ఉండి కూడా డీలిమిటేషన్‌ను అడ్డుకుంటుంది. కరోనా మహ్మమారి కారణంగా 2021లో జనగణన చేయలేకపోయాం. 2024లో చేద్దామనుకుంటే కులగణన డిమాండ్ తెరపైకి తెచ్చారు. అందరి అభిప్రాయాలతో 2026లో జనగణనతో పాటు కులగణన చేయాలని నిర్ణయించాం. కులగణనకు మేం ఒప్పుకున్నా అభినందించేందుకు ప్రతిపక్షాలకు చేతులు రావడం లేదు. పోగా కులగణనను అడ్డుకోవడానికి రాజ్యాంగ సవరణ చేస్తున్నట్లుతప్పుడు ప్రచారం చేస్తున్నారు.
దేశంలో ఉత్తరాదికి, దక్షిణాదికి సమాన అధికారులు ఉన్నాయి. దేశంలో విభజన రాజకీయాలు, ప్రాంతీయ విభేధాలకు చోటు లేదు. మాకు దేశ ప్రయోజనాలే ముఖ్యం. విభజన రాజకీయాలతో అధికారం దక్కదు. డీలిమిటేషన్‌తో తర్వాత ఎక్కడ సీట్లు తగ్గవు. దక్షిణాది రాష్ట్రాలు భయపడాల్సిన అవసరం లేదు. నార్త్, సౌత్ అనే భేదాలు తీసుకురాకండి. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలనుకుంటే ప్రజలు ఆమోదించరు. సౌత్, నార్త్ అనే భేదాన్ని తాము సహించం. రాహుల్ గాంధీ సభ సమయాన్ని వృధా చేయడం మానుకోవాలి’’ అని అమిత్ షా పేర్కొన్నారు.

