నా శవంపై కాషాయ జెండా కప్పాలి అదే నా చివరి కోరిక: కేంద్ర మంత్రి బండి సంజయ్

నా శవంపై కాషాయ జెండా కప్పాలి  అదే నా చివరి కోరిక: కేంద్ర మంత్రి బండి సంజయ్
  • కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నాపై విష ప్రచారం చేస్తున్నది 
  • పదేండ్ల గడీల పాలన బద్దలు కొట్టినందుకే నాపై ఆక్రోశం
  • తన కొడుకును తానే పోలీసులకు అప్పగించినట్టు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ‘బీజేపీలో కమిట్​మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పనిచేసే ఏ కార్యకర్త అయినా.. నీ చివరి కోరిక ఏంటని అడిగితే.. నేను చనిపోయాక నా శవంపై కాషాయ జెండా కప్పాలని కోరుకుంటాడు. నాది కూడా అదే చివరి కోరిక’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయనపై సోషల్​ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని, కొత్త పార్టీ పెడ్తున్నారనే వార్తలను బండి సంజయ్​ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ నడుపుతున్న ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నుంచే తన బర్తరఫ్, అరెస్ట్ వార్తలు పుట్టుకొస్తున్నాయని  ఆరోపించారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసుకు బండి సంజయ్​ వచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో బీఆర్ఎస్ కు17 ఎంపీ సీట్లున్నాయి కదా.. ఆ పార్టీ భాగస్వామ్యంతోనే కేంద్రంలోని ఎన్డీఏ నడుస్తోంది కదా? బహుశా నన్ను బర్త్​రఫ్ చేయాలనే నిర్ణయం కేసీఆర్, ఆయన కొడుకే తీసుకున్నట్లున్నారు. ఇంకా ఏమేం చేయబోతున్నారో వాళ్లనే అడగండి’ అని ఎద్దేవా చేశారు. 


పదేండ్ల కేసీఆర్ అరాచక, అవినీతి పాలనను, వారి గడీలను బద్దలు కొట్టినందుకే తనపై కక్షగట్టి ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోయిందనే కోపం వాళ్లకుంటుందని, అందుకే తనను అరెస్టు చేయించాలని చూస్తున్నారేమో అని పేర్కొన్నారు. కేటీఆర్ విసిరే చిల్లర మెతుకులకు ఆశపడి ఒకటీ రెండు ఛానళ్లు తనను అరెస్టు చేయబోతున్నారనే కథలను ప్రసారం చేస్తున్నాయని ఆరోపించారు. 

కేటీఆర్​వి దిగజారుడు రాజకీయాలు

తన కుమారుడు బండి భగీరథ్ విషయంలో వస్తున్న ఆరోపణలపై సంజయ్ స్పందించారు. ‘ఏ తండ్రి అయినా తన కొడుకును పోలీసులకు అప్పగిస్తాడా ? కానీ, విచారణ జరపాలని పోలీసులు కోరగానే నేనే స్వయంగా నా కొడుకును విచారణకు పంపాను. చట్టం మీద నాకున్న గౌరవంతోనే ఇది చేశాను’ అని వెల్లడించారు. దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం కేటీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. తనపై ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు, కార్యకర్తలు బీజేపీ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని, తనను బదనాం చేసేందుకు కేసీఆర్ కొడుకు సోషల్ మీడియాలో ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడని, ఇలాంటి ఎన్ని వార్తలు వండి వార్చినా జనం బీజేపీతోనే ఉన్నారని వివరించారు. ఫేక్ వార్తలను, ఫేక్ స్టోరీలను చూసి జనం నవ్వుకుంటున్నారని సంజయ్ ఎద్దేవా చేశారు. సంజయ్ వెంట ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, సీనియర్ నేతలు డాక్టర్ మనోహర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.