- 1.24 లక్షల మంది స్టూడెంట్లకు న్యాయం చేయాలని విజ్ఞప్తి
- మానవీయ కోణంలో సమస్యను పరిష్కరించాలని వినతి
హైదరాబాద్, వెలుగు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్యూ) డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా తెలంగాణలో చదువుకున్న 1.24 లక్షల మంది విద్యార్థుల డిగ్రీ, పీజీ పట్టాలను ఉద్యోగ, పైచదువుల నిమిత్తం గుర్తించాలని ఆ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్‌ఈ) సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ కు ఆయన ఇటీవల సుదీర్ఘమైన లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించే ఉద్యోగ నియామకాల్లో నాగార్జున వర్సిటీ డిస్టెన్స్ పట్టాలను తిరస్కరిస్తున్నారని, దీంతో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
విభజన చట్టం ప్రకారం అడ్మిషన్లు ఇచ్చాం..
రాష్ట్ర విభజన చట్టం-2014లోని పార్ట్-2 పాయింట్ 5 ప్రకారం.. పదేండ్ల పాటు (2024 వరకు) హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉందని వర్సిటీ గుర్తు చేసింది. అలాగే సెక్షన్ 95 ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విద్యావకాశాలు, అడ్మిషన్ల కోటాలు రెండు రాష్ట్రాల్లోనూ పదేండ్ల పాటు కొనసాగాలని నిబంధన ఉందని పేర్కొంది. ఈ నిబంధనల ప్రకారమే 2014 నుంచి 2020 వరకు తెలంగాణలోని స్టడీ సెంటర్ల ద్వారా విద్యార్థులు కోర్సులు పూర్తి చేశారని వివరించింది. 2020 తర్వాత తెలంగాణలో అడ్మిషన్లను పూర్తిగా నిలిపివేసినట్లు స్పష్టం చేసింది. అయితే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాగార్జున వర్సిటీ పట్టాలను అంగీకరించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వర్సిటీ రిజిస్ట్రార్లేఖలో పేర్కొన్నారు. యూజీసీ, డీఈబీ నిబంధనల ప్రకారమే ఈ కోర్సులు నిర్వహించామని తెలిపారు. తెలంగాణకు చెందిన యూనివర్సిటీలు కూడా 2014 తర్వాత ఏపీలో స్టడీ సెంటర్లు నడిపి సర్టిఫికెట్లు జారీ చేశాయని, విద్య, ఉద్యోగ ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం వాటిని అనుమతిస్తున్నదని పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులు నష్టపోకుండా వారి సర్టిఫికెట్లను అన్ని రకాల ఉద్యోగావకాశాలు, పైచదువులకు పరిగణనలోకి తీసుకోవాలని టీజీసీహెచ్ఈకి రిజిస్ట్రార్ విజ్ఞప్తి చేశారు.
1.24 లక్షల మందిని ఆదుకోండి
2014 నుంచి 2020 మధ్య కాలంలో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 53 కోర్సులకు సంబంధించి 1,24,524 మంది విద్యార్థులు నాగార్జున వర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అడ్మిషన్లు తీసుకుని చదువులు పూర్తి చేశారని రిజిస్ట్రార్ వెల్లడించారు. వీరిలో అత్యధికంగా బీఏలో 17,666, బీఎల్ఐఎస్సీ 17,294, బీకామ్ 14,299, బీఎస్సీ 12,042, ఎంఎస్సీ మ్యాథ్స్ 10,235, ఎంఏ తెలుగు 9,780, ఎంఏ ఇంగ్లిష్ 6,577 మంది విద్యార్థులు ఉన్నారని కోర్సుల వారీగా వివరాలను లేఖతో పంపించారు. ఈ డిగ్రీలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించకపోతే, లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని, మానవీయ కోణంలో ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
