తక్కువ ధరకు నిత్యావసర వస్తువులంటూ మోసం

తక్కువ ధరకు నిత్యావసర వస్తువులంటూ మోసం

ఫేక్ వెబ్ సైట్ క్రియేట్ చేసి తక్కువ ధరకు ఫర్నీచర్, నిత్యావసర వస్తువులు ఇస్తానంటూ మోసం చేస్తున్న వ్యక్తిని సైబర్ క్రైం, రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి దగ్గరి నుంచి 40 లక్షల నగదు, 20 డెబిట్ కార్డులు, 6 బ్యాంక్ పాస్ బుక్స్, 2 లాప్ టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. యూపీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రిషబ్ ఉపాధ్యాయ బెంగళూరు కేంద్రంగా www.Zopnow.in,www.mondayfurniture.in పేరుతో అమాయకుల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నాడు.

‘ఫేక్ వెబ్‌సైట్ ద్వారా లావాదేవీలు చేస్తున్నాడని తెలిసి రేజర్ పే వాళ్ళు కూడా రిషబ్ అకౌంట్‌ని బ్లాక్ చేశారు. ఇతనిపై సైబరాబాద్‌లో 9 కేసులున్నాయి. 
దేశవ్యాప్తంగా చాలా మంది బాధితులున్నారు. వారంతా దగ్గరున్న పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని కోరుతున్నాం. ఏదైనా వెబ్‌సైట్ విజిట్ చేసే ముందు అఫీషియలా? కాదా? అని తెలుసుకోవాలి. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేటప్పుడు వస్తువు డెలివరీ అయ్యాక డబ్బులు పే చేయాలి. సైబరాబాద్‌లోని ప్రతీ పోలీస్ స్టేషన్‌లో సైబర్ క్రైమ్ వింగ్ ప్రారంభించాం. సైబరాబాద్ పరిధిలో జూలై నెలలో 380 సైబర్ క్రైమ్ కేసులు నమోదు అయ్యాయి’ అని సీపీ సజ్జనార్ తెలిపారు.