ఆయుధాల కొరతతో ఆగిన దాడులు.. ఇరాన్‌‌‌‌పై 13 రోజులుగా కొనసాగుతున్న అటాక్స్కు బ్రేక్

ఆయుధాల కొరతతో ఆగిన దాడులు.. ఇరాన్‌‌‌‌పై 13 రోజులుగా కొనసాగుతున్న అటాక్స్కు బ్రేక్
  • దౌత్య ప్రయత్నాలు ఊపందుకోవడం, యుద్ధం విస్తరించకూడదనే దాడులు ఆపామన్న ట్రంప్ 
  • సౌదీ చమురు కేంద్రాలపై హౌతీల దాడులు

టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్‌‌‌‌పై 13 రోజులుగా వరుసగా జరుపుతున్న దాడులను అమెరికా బలగాలు నిలిపేశాయి. శుక్రవారం నుంచి వరుసగా మూడో రోజున ఆదివారం కూడా ఇరాన్‌‌‌‌పై అమెరికా బలగాలు ఎలాంటి వైమానిక దాడులు చేయలేదు.

అయితే, దౌత్య ప్రయత్నాలు ఊపందుకోవడంతో పాటు అమెరికా క్షిపణి నిల్వలు తగ్గిపోతుండటం, భవిష్యత్తులో ఘర్షణ మరింత ముదిరి యుద్ధం విస్తరిస్తుందనే భయాల కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని అమెరికన్ మీడియా సంస్థలు వెల్లడించాయి. శుక్రవారం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు రెండు వారాల పాటు ప్రతిరోజూ జరిగిన అమెరికా దాడులకు తొలిసారి బ్రేక్ పడింది.

ఆక్సియోస్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. కొత్త దాడుల ప్రణాళిక అందినప్పటికీ, తాజా దాడులు చేయవద్దని ట్రంప్ సైన్యాన్ని ఆదేశించారు. ఒకవేళ అవసరమైతే సైనిక చర్యలను పునఃప్రారంభించడానికి అమెరికా సిద్ధంగా ఉన్నప్పటికీ, ఈ నిర్ణయం చర్చల వైపు అడుగులు వేస్తున్నట్లుగా సంకేతం ఇస్తోంది. ట్రంప్ నిర్ణయంపై వైట్ హౌస్‌‌‌‌ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే వైట్ హౌస్‌‌‌‌ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్ మాట్లాడుతూ.. ట్రంప్ ఎప్పుడూ దౌత్యపరమైన పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు.

సౌదీ చమురు కేంద్రాలపై హౌతీల దాడులు 
ఎర్ర సముద్ర తీరంలో సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్​కో చమురు కేంద్రాలపై యెమెన్‌‌‌‌లోని హౌతీ రెబెల్స్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారు. వ్యూహాత్మక ఎర్ర సముద్ర పోర్ట్ నగరమైన హోడెడాపై సౌదీ జరిపిన వైమానిక దాడులకు ప్రతి స్పందనగా తాము సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు హౌతీ రెబెల్స్ ప్రకటించారు. యెమెన్‌‌‌‌పై సౌదీ దిగ్బంధనాన్ని విధిస్తోందని, సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడులతో సహా ఇటీవలి దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.