హైదరాబాద్, వెలుగు: జూన్ నెలాఖరులోగా పీఆర్సీ నివేదిక తెప్పించుకొని, మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఆలస్యం చేస్తే జూలైలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించింది. సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో చావ రవి అధ్యక్షతన యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా చావ రవి మాట్లాడుతూ.. రెండో పీఆర్సీ నియమించి 35 నెలలు గడిచినా ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వెంటనే అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, మారుమూల గ్రామాల్లోనూ ప్రభుత్వ బడి ఉండాలని కోరారు.
పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలని, ఆగస్టులో టీచర్ల బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. వెంకట్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నేతలు లక్ష్మారెడ్డి, రవికుమార్, శ్రీధర్, జ్ఞానమంజరి తదితరులు పాల్గొన్నారు.
