- రిజర్వాయర్ల వద్ద సోలార్ పవర్ ఉత్పత్తిపై స్టడీ చెయ్యండి
- పని చెయ్యని కాంట్రాక్టర్లపై నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశాలు
- సెక్రటేరియెట్లో ఉన్నత స్థాయి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాజెక్టులకు సమగ్రమైన యాక్షన్ ప్లాన్ తయారు చెయ్యాలని, వీలయినంత త్వరగా జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో తీసుకున్న కీలక నిర్ణయాలను క్షేత్ర స్థాయిలో అమలు చెయ్యాలని సూచించారు. సోమవారం ఆయన సెక్రటేరియెట్లో ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు.
సీఎం రేవంత్ పెట్టిన డెడ్ లైన్స్ కు తగ్గట్టుగా పనులు చెయ్యాల్సిందేనని, అందులో ఎలాంటి మినహాయింపులు లేవని స్పష్టం చేశారు. భూసేకరణలో ఉన్న సమస్యలు, విద్యుత్ సరఫరా, కాంట్రాక్టర్ పెర్ఫార్మన్స్ వంటి అంశాలపై యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని సూచించారు. ప్రతి పెద్ద ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేస్తారో సీఈలు కంప్లీషన్ షెడ్యూల్స్ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు భూసేకరణ పనులపై ఫోకస్ పెట్టాలన్నారు.
పాలమూరుపై ఫోకస్
కల్వకుర్తి లిఫ్ట్ లోని పంపింగ్ స్టేషన్ల రిపేర్లను వేగంగా చెయ్యాలని అధికారులకు మంత్రి సూచించారు. 2027 మార్చి నాటికి అన్ని మోటార్లు నడవాలని తేల్చి చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ రిజర్వాయర్ కెనాల్ పనులను 2027 జూన్ నాటికి పూర్తి చెయ్యాలని ఆదేశించారు. నార్లాపూర్, ఏదుల, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన కుటుంబాలకు త్వరగా పరిహారం, పునరావాస చర్యలు చేపట్టాలన్నారు.
కరివెన రిజర్వాయర్ ప్రధాన పనులను డిసెంబర్ నాటికి పూర్తి చెయ్యాలని సూచించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం పంప్ హౌస్ లకు వెంటనే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నారు. భవిష్యత్ లో కరెంటు ఖర్చులు తగ్గించుకునేందుకు రిజర్వాయర్ల దగ్గర సోలార్ పవర్ ఏర్పాట్లపై స్టడీ చెయ్యాలన్నారు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ స్కీం భూసేకరణను జులై నాటికి పూర్తి చెయ్యాలని సూచించారు.
2,200 ఎకరాలు సేకరించాలని, మరో 4,200 ఎకరాలకు సంబంధించి పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. రాజీవ్ బీమా స్టేజ్ 1 పనులకు సంబంధించి జులై నాటికి 80 ఎకరాల సేకరణపై సమస్యలను పరిష్కరిచాలని సూచించారు. కోయిల్సాగర్ ప్రాజెక్ట్ పెండింగ్ పనులు 2027 మార్చి వరకు పూర్తికావాలన్నారు. తుమ్మిళ్ల లిఫ్ట్ రెండో దశకు 567 ఎకరాలు సేకరించాల్సి ఉందని, రైతులను ఒప్పించి భూములను తీసుకోవాలని చెప్పారు.
ప్రతి నెలా సమీక్ష
ప్రాజెక్టులకు సంబంధించి నెలవారీ సమీక్షలు చెయ్యాలని, భూసేకరణపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యంగా పెట్టుకున్నదన్నారు. పని చెయ్యని కాంట్రాక్టర్లపై నిఘా పెట్టాలని సూచించారు.
