- భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి
- నీటిని పొదుపుగా వాడుకునేలా కఠిన రూల్స్ పెట్టండి
- అధికారులకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఆదేశం
- గ్రామాల్లో కొత్త బోర్లు వెయ్యకుండా చర్యలు
- గ్రౌండ్ వాటర్ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయాలని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బోర్ల ద్వారా భూగర్భ జలాలను ఇష్టమొచ్చినట్లు తోడేయకుండా అడ్డుకోవాలని, నీటిని పొదుపుగా వాడుకునేలా కఠినమైన రూల్స్ పెట్టాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా అతిగా భూగర్భ జలాలను తోడేస్తున్న ప్రాంతాల్లో నిబంధనలను పటిష్టం చేయాలన్నారు. శుక్రవారం ఆయన సెక్రటేరియెట్ లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయన్నారు.
జిల్లా స్థాయిలో గ్రౌండ్ వాటర్ కమిటీల ఏర్పాటుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కమిటీలు నిరంతరం భూగర్భ జలాల వినియోగం, రీచార్జ్ (పునరుద్ధరణ) ప్రక్రియలపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. రాష్ట్రంలో 2024తో పోలిస్తే 2025లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 2024లో 18.44 లక్షల హెక్టార్ మీటర్ల మేర భూగర్భ జలాలుండగా.. 2025 నాటికి అది 19.61 లక్షల హెక్టార్ మీటర్లకు పెరిగిందని పేర్కొన్నారు. అయితే, పెరిగిన జలాలకు అనుగుణంగానే నీటి వాడకం కూడా పెరిగిందని చెప్పారు. గతంలో ఉన్న 8.45 లక్షల హెక్టార్ మీటర్ల వినియోగం.. ప్రస్తుతం 9.18 లక్షల హెక్టార్ మీటర్లకు పెరిగిందని గణాంకాలతో వివరించారు.
కొత్త బోర్లు వెయ్యకుండా చూడండి..
భూగర్భ జలాలను అతిగా వాడుతున్న గ్రామాలను ప్రత్యేకంగా గుర్తించి, ఆయా ప్రాంతాల్లో కొత్తగా బోర్లు వేయకుండా జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. హైదరాబాద్‌తో పాటు మరో 16 జిల్లాల్లో భూగర్భ జలాల వినియోగం అత్యధికంగా జరుగుతోందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయా ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించాలని ఆయన సూచించారు. అలాగే, ఇసుక మైనింగ్ ఆపరేషన్లకు అనుమతులు ఇచ్చేముందు గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్‌తో కచ్చితంగా సంప్రదింపులు జరపాలని స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద అర్హులైన లబ్ధిదారులకు బోర్ల తవ్వకం పనులను చేపట్టాలని ఆదేశించారు.రాష్ట్రంలో భూగర్భ జలమట్టాన్ని మరింత పెంచే మార్గాలపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ విషయంలో గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్, పంచాయతీరాజ్, ఇండస్ట్రీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, హైడ్రాలజీ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.
