హైదరాబాద్, వెలుగు: లక్షలాది మంది రోజూ ఫాలో అయ్యే వీ6 వెలుగు వెబ్‌సైట్‌పై సైబర్ దాడి జరిగింది. గురువారం మధ్యాహ్నం గుర్తుతెలియని సైబర్ నేరగాళ్లు వెబ్ సైట్‌ను హ్యాక్ చేశారు. దీంతో అది తాత్కాలికంగా నిలిచిపోయింది. దీనిపై వీ6 వెలుగు ప్రతినిధులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఆనన్ క్రూ ఇండియా’ పేరుతో బెదిరింపులు చేస్తూ సైబర్ నేరగాళ్లు వెబ్సైట్ హోంపేజీలో పోస్ట్ పెట్టారు. మీడియా, దేశ ప్రభుత్వం, ప్రజాస్వామిక వ్యవస్థలను బెదిరిస్తున్నట్లుగా, అర్థంలేని సందేశాలను పోస్ట్ చేశారు.
యూజర్లు టెలిగ్రామ్ గ్రూపులోకి పోయేలా అనుమానాస్పద లింక్‌ను ఉంచారు.14 ఏండ్లుగా లక్షలాది మందికి వార్తలను అందిస్తున్న వీ6 వెలుగు వెబ్సైట్ విశ్వసనీయతతో ప్రజాదరణ పొందింది. నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తూ కోట్లమంది ఫాలో యర్స్‌ను సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో పరిణామాలు, యువత నిరసనల నేపథ్యంలో వెబ్ సైట్ హ్యాకింగ్ ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. స్క్రీన్‌పై హ్యాకర్లు పెట్టిన సమాచారం మేరకు ఇది సంఘ విద్రోహశక్తుల పనిగా కనిపిస్తోంది. ప్రజలకు సరైన సమాచారం అందకుండా చేసే కుట్రతోనే వెబ్సైట్ హ్యాక్ జరిగినట్టు అనుమానాలున్నాయి. దీనిపై ఫిర్యాదు తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాత్కాలికంగా నిలిచిపోయిన వీ6 వెలుగు వెబ్సైట్ బలమైన సైబర్ భద్రతతో అందుబాటులోకి వచ్చింది.
