ఆత్మకు అనువాద రూపం కవిత్వం: ఆచార్య కడారు వీరారెడ్డి

ఆత్మకు అనువాద రూపం కవిత్వం: ఆచార్య కడారు వీరారెడ్డి

“నా  కవిత - మదిలో మెదిలే ఊహల మెరుపు మేఘం, రసజ్ఞుల ధమనుల్లో ధ్వనించే వసంత రాగం, వికసిస్తే నందనవన సుగంధ పరిమళం, విజృంభిస్తే ప్రళయ ఝంఝా మారుతం’’ అంటూ కవన మల్లుతున్నాడు ఆచార్య కడారు వీరారెడ్డి. అతని మస్తిష్కంలో ఏవో కొత్త మెరుపులు మెరుస్తాయి. ఆలోచనలు ముసురుతాయి. అవి అక్షరకూర్పులవుతాయి. పద ప్రవాహాల వాటికలవుతాయి. ఒక్కొక్కసారి ఏకాగ్రతలో భావాలు వరదలా పొంగుతాయి, అవన్నీ తెల్లని కాగితంపై పరుచుకుంటాయి. శిలను చెక్కినకొద్దీ నాజూకు శిల్పమైనట్లు, కవితనూ చెక్కడానికి ప్రయత్నిస్తాడు. వీరారెడ్డి రాసిన గత కవిత్వ గ్రంథాలను పరిశీలిస్తే ‘ఝంఝా మారుతం’ కవిత్వ పరిణతి స్పష్టంగా తెలుస్తుంది. ఇతని దృష్టిలో ఆత్మకు అనువాద రూపం కవిత్వం. నిరక్షరాస్యుడైనా పెల్లుబికే భావాలకు అక్షరరూపం ఇవ్వగలిగితే అతనూ ఓ రచయితేనని, ఆ సృజనా సరళిని ఓ చోట క్రోడీకరిస్తే అది ప్రత్యేక గ్రంథమవుతుందని ప్రకటిస్తాడు. ఇందులోని ‘ప్రేమ భిక్షువు’ మధురమైన ఓ ప్రేమగీతం. ‘మనోజ్ఞ గోచరం’ పరవశింపజేసే ప్రకృతి కవిత్వం.

ఇతడు జీవితం గురించి చెప్పిన కవితల్లో జీవం ఉంది. చిగురుటాకుల చిద్విలాసం ముద్దులొలికే శైశవం, నూనూగు నురగల పరుగులతో పొంగే యవ్వనం, ముక్కుతూ మూల్గుతూ వెళ్లదీసే మూడుకాళ్ల జీవితం ముఖ్యమైన మూడు దశలనూ ఓ కవితలో ఉటంకించాడు. “ఈ రోజుటి నీవు నిన్నటిదాకా గడచిన దానికి ప్రతిరూపం, రేపటి నీవు నేటినుండి చేసే నీ అడుగుల పట్టిక, తరచిచూస్తే జీవితం ఎల్లప్పుడూ నిరవధిక నిర్మాణ దశలోనే” అనే సత్యాన్ని వెల్లడించాడు. జీవించడమంటే, కాలంతోపాటు కదలడం అని ఉద్ఘాటించాడు. “ఏ క్షణానికి ఏమి జరుగునో తెలియకపోవటమే ఆటకు రసపట్టు. ఆట ఆగిన మరుక్షణం ప్రపంచం నుండి నిష్క్రమణ” అనే వాస్తవాన్ని చాటాడు. ఆరుకూ నూరుకూ ఏదో బంధం, అరిషడ్వర్గాన్ని నియంత్రిస్తే నూరేళ్ల ఆయుష్షు ఖాయం, నూరేళ్లు నిండాకా సమాధికి ఆరడుగుల గుంత అవసరం అని తాత్త్వికతను బోధించాడు.
ఈ కవి కుటుంబ బంధాలకు ప్రాధాన్యత ఇస్తాడు. తన భుజాలనే పల్లకి చేసి మోశాడు నాన్న. తన గుండెనే ఉయ్యాల చేసి గోరుముద్దలు తినిపించింది అమ్మ. “నీ పుట్టుక, వారి ఉమ్మడి సంతకం - నీ జాతకం, వారి జీవనరేఖల సమ్మేళనం - నీ అస్థిత్వం, వారి రక్తం’’ అని కవి ఉద్భోధ. ‘‘కుటుంబమంటేనే / షరతులు కనిపించని ఒడంబడిక / ఉమ్మడి ధైర్యశాల / సహజసుందర కవచం / ‘నేను’ను మరపించి ‘మనం’కు నిండు నిర్వచనమై నిలిచే / వంశ వృక్షం” అని పేర్కొంటాడు.

ఇందులో ఉన్న సామాజికాంశాలనూ స్పృశిద్దాం. నేటి చదువులు నిర్లక్ష్యపు రాచపుండ్లు. చూపులకు ఏపులా ఉన్న మేడిపండ్లు. చదువు‘కొంటున్నారు’. ప్రతిభ ఆదరణ కోల్పోతున్నది. సృజన శీలత కొరవడుతున్నది. ‘సున్నా’ కనిపెట్టిన దేశంలో విలువలు శూన్యమౌతున్నాయి. “ప్రాథమిక దశ నుండి పైస్థాయి దాకా / బోగస్ బోధకులు /  ఎందుకూ కొరగాకుండాపోయే ప్రమాదంలో/ రేపటితరాలు” అని వాపోతున్నాడు. అడవి తల్లికి శోభనిచ్చే గుట్టలు, చెట్లు చేమలు, ప్రాంగణం పరువాల్లో సందడిచేసే పశు పక్ష్యాదులు కనుమరుగవుతున్నాయి. నేడు రాజకీయం కులం, మతం, వర్గం, తెగల ఆసరాగా ప్రజల మనోభావాలతో ఆడుకునే అవకాశాల ఆట. గుక్కెడు నీళ్లిచ్చి గుమ్మడికాయంత ప్రకటనలిచ్చుకుంటారు. నీటిని మించి అంగడి సరుకుందా ఈ రోజుల్లో? విశ్వనగరం అని చెప్పుకునే రాజధానిలో ఒక్కవాన పడినా జనం వరదతో బురదతో సహజీవనం. “నాయకుడు నడుము ఊపినా / ప్రతినాయకుడు ఇకిలించినా / గుర్తింపు లోకైక విదితం / సామాన్యుడు వేదనతో అరిచినా అరణ్యరోదనం”.
“హాయిగా ఆకాశంలో విహరించే విహంగాలు / గుంపులు గుంపులుగా నీటిని ఈదే జలచరాలు / బారులుగా నేలపై పారే చీమలదండు / వరుసగా సాగిపోయే పశువుల మంద” నుంచి మనుషులు క్రమశిక్షణ నేర్చుకోవాలి. నటన ఏ జంతువుకు లేని లక్షణం. కాని ప్రతి మనిషికి ఎందుకో నటించడం ఇష్టం? అని అడుగుతాడు.
ఈ గ్రంథంలోని ‘‘ప్రవహిస్తేనే నదికి స్వచ్ఛత - పయనిస్తూ వెళ్తేనే మనిషికి ప్రపంచంతో పరిచయం” “ఓడిపోయినా పట్టువీడక నవనవోన్మేషంతో మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి” “ఎక్కడమంటూ మొదలుపెడితే -శిఖరాగ్రం ఎంత ఎత్తున ఉన్నా - మెట్టు మెట్టుకో కొత్త అనుభవం” “భిన్నంగా ఆలోచిస్తేనే ఎంత అసాధారణ మైనా ఎగురుకుంటూ వచ్చి నేరుగా ఒడిలో వాలుతుంది గెలుపు” “అమ్ములపొదిలో అస్త్రాలెన్ని ఉన్నా - అవసరాన్ని బట్టి వాడడం విజ్ఞత” “అడుగు అడుగులో సృజనాత్మకత ప్రతిబింబిస్తూ జీవనయానం సాగాలి” మొదలైన పంక్తులు జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి అనువైన సూక్తులు.

ఇంకా ఇందులో -అన్ని అభివృద్ధులకు కారకులైన కోట్లమంది వలస శ్రామికులు, శ్వాసించే దశనుంచి స్మశానం చేరేదాకా మనకు ఉపయోగపడే చెట్లు, మన భవితవ్యం కోసం జీవితాలను త్యాగం చేసిన తెలంగాణ అమరులు కవితా వస్తువులు. ఇవన్నీ కవన వీచికలు. అలరిస్తాయి, ఆలోచింపజేస్తాయి. నిజమైన ఝంఝామారుతం లాంటి కవిత్వం ఈ కవి నుండి ఇంకా రావాల్సి వుంది. రసాయనశాస్త్రంలో ఆచార్యుడిగా, విశ్వవిద్యాలయానికి వైస్​ఛాన్స్​లర్​​గా సేవలందించి, పదవీ విరమణ పొందినా కవిత్వాన్ని వదలకుండా గ్రంథాలను రచిస్తున్న కడారు వీరారెడ్డి అభినందనీయుడు. ఎ.గజేందర్ రెడ్డి- 9848894086