
తోటి బ్యాట్స్ మెన్ పెవిలియన్ బాట పట్టినా ఒక్కడే నిలబడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లకు పట్ట పగలే చుక్కలు చూపిస్తూ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సిక్సర్లు, ఫోర్లు బాదుతూ ముంబై బౌలర్లను హడలెత్తించాడు. ఆదివారం నాడు వాంఖడే స్టేడియంలో జరిగిన ముంబై, కోల్కతా మ్యాచ్ లో ఇదే జరిగింది. ముంబై బౌలర్లను ఊచకోత కోసిన వెంకటేష్ అయ్యర్ 51 బంతుల్లోనే సెంచరీ (104) పూర్తి చేసుకున్నాడు. అందులో ఆరు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి.
ఈ మ్యాచ్ లో చెలరేగి ఆడిన వెంకటేశ్ అయ్యర్ కోల్ కత్తా నిరీక్షణకు తెరదించాడు. సరికొత్త రికార్డు సృష్టించాడు. కేకేఆర్ టీం తరఫున 15 ఏళ్ల తర్వాత సెంచరీ చేసిన రెండో ప్లేయర్ గా వెంకీ నిలిచాడు. ఐపీఎల్ తొలి సీజన్ (2008)లో బ్రెండన్ మెక్ కల్లమ్ కోల్ కతా తరుపున మొదటి సెంచరీ చేశాడు. ఆ తర్వాత సెంచరీ చేసిన రెండో కోల్ కతా ప్లేయర్ గా వెంకీ రికార్డుకెక్కాడు. ఈ మ్యాచ్లో సూపర్ బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ ముంబైకి ఈ సీజన్ లో రెండో విజయాన్ని అందించారు.