చట్టాలున్నా రాష్ట్రంలో గోవధ ఆగట్లేదు : సెక్రటరీ సురేందర్ కుమార్ జైన్

చట్టాలున్నా రాష్ట్రంలో గోవధ ఆగట్లేదు : సెక్రటరీ సురేందర్ కుమార్ జైన్
  •     ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి 
  •     ఇందిరా పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షలు

ముషీరాబాద్/అబిడ్స్, వెలుగు: తెలంగాణలో గోరక్షా చట్టాలను అమలు చేయడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని విశ్వహిందూ పరిషత్ అఖిల భారత జాయింట్ జనరల్ సెక్రటరీ సురేందర్ కుమార్ జైన్ విమర్శించారు. గురువారం ఇందిరా పార్క్ వద్ద ‘దేశీ గోవంశ రక్షణ సంవర్తన సమితి’, ‘గోశాలల సేవా సమితి’, ‘వీహెచ్​పీ’ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అబిడ్స్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. 1977లోనే గోవధ నిషేధ చట్టం వచ్చినప్పటికీ, 50 ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. 

బక్రీద్ పండుగ సాకుతో వేలాది గోవులను అక్రమంగా తరలిస్తున్నా, పోలీసులు ఎంఐఎం నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలు అడ్డుకున్న గోవులను గోశాలలకు కాకుండా తిరిగి వధశాలలకే తరలించడం దారుణమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అక్రమ వధశాలలను మూసివేసి, చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీహెచ్​పి రాష్ట్ర అధ్యక్షుడు నరసింహమూర్తి, రావినూతల శశిధర్ పాల్గొన్నారు.