శ్రీఇమిగ్రేషన్స్ కేసును సీబీఐకి అప్పగించాలి..బాధితుల డిమాండ్

 శ్రీఇమిగ్రేషన్స్ కేసును సీబీఐకి అప్పగించాలి..బాధితుల డిమాండ్

పంజాగుట్ట, వెలుగు: విదేశీ వీసాలు, ఉద్యోగాల పేరుతో సుమారు 500 మంది సాఫ్ట్​వేర్ అభ్యర్థుల నుంచి రూ.10 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిన ‘శ్రీ ఇమిగ్రేషన్స్’ కేసును సీబీఐకి అప్పగించాలని బాధితులు డిమాండ్ చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో బాధితులు మాట్లాడుతూ.. కోట్లాది రూపాయలు వసూలు చేసి ముఖం చాటేసిన సంస్థ యజమానులు వేదుల శ్రీకిరణ్, నివేదితను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో గచ్చిబౌలి పోలీసులు నిందితులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, ఇతర ప్రాంతాల అభ్యర్థులు అప్పులు చేసి మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు రవీందర్ రెడ్డి, బానోత్ రవి, వర్షిణి, అశోక్, ప్రశాంతి తదితరులు వేడుకున్నారు.