తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే సంకీర్ణ ప్రభుత్వంపై డీఎంకే సీనియర్ నాయకురాలు, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుత విజయ్ ప్రభుత్వం ఆరు నెలలు కూడా కొనసాగదని, కుప్పకూలడం ఖాయమని జ్యోస్యం చెప్పారు. ఏప్రిల్ ఎన్నికల్లో టీవీకే ఘనవిజయం సాధించినప్పటికీ.. త్వరలోనే డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని అన్నారు.
దక్షిణ తమిళనాడులో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో అనితా రాధాకృష్ణన్ నేరుగా టీవీకే సీనియర్ నేత ఆధవ్ అర్జునకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.ఈ ప్రభుత్వం మరో నాలుగు నెలలు మాత్రమే అధికారంలో ఉంటుంది. ఆధవ్ అర్జునకు దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. నేను కూడా రాజీనామా చేస్తా. తిరుచెందూర్‌లో నాపై పోటీ చేసి గెలవాలి" అంటూ సవాలు విసిరారు.
అటు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో ఓడిపోవడంపై కూడా రాధాకృష్ణన్ స్పందించారు. స్టాలిన్‌ను ఓడించిన ఓటర్లను పనికిరానివారు అని విమర్శిస్తూనే.. స్టాలిన్ కొలత్తూరును సింగపూర్‌లా మార్చారని కొనియాడారు. రాబోయే నాలుగు లేదా ఆరు నెలల్లో 'తలైవర్' స్టాలిన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ ఘాటు వ్యాఖ్యలపై అటు సీఎం విజయ్ కార్యాలయం కానీ, ఇటు టీవీకే శ్రేణులు కానీ ఇప్పటివరకు స్పందించలేదు.
గత ఎన్నికల్లో 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుని, కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో జోసెఫ్ విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య అసెంబ్లీలో విశ్వాస పరీక్ష కూడా నెగ్గారు. కానీ, అప్పటి నుండి డీఎంకే, టీవీకేల మధ్య రాజకీయ పోరు నిరంతరాయంగా సాగుతూనే ఉంది. ఇప్పుడు డీఎంకే ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో మరింత కాక రేపుతున్నాయి.
