హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌లో ఉన్న అజరుద్దీన్.. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావుతో జతకట్టాడని హెచ్‌సీఏ మాజీ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ జి. వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు హెచ్‌సీఏ అభివృద్ధికి పాటు పడిన తనను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకుంటున్నారన్నారు. గతంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించేందుకు అంబుడ్స్‌మన్ చూపిన తప్పుడు ఆధారాలను అడ్డం పెట్టుకొని ఈ సారి తన నామినేషన్‌ను తిరస్కరించారని ఆరోపించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అజరుద్దీన్‌పై బీసీసీఐ లైఫ్ బ్యాన్ ఎత్తి వేయకున్నా కూడా అతని నామినేషన్‌ను ఎలా అంగీకర్తిస్తారని మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివేక్ ప్రశ్నించారు. ఇన్నేళ్లలో హైదరాబాద్ క్రికెట్‌కు అజర్ ఏమీ చేయలేదన్నారు. బీసీసీఐ నుంచి నిధులు రాకున్నా కూడా గత టర్మ్‌లో హెచ్‌సీఏను తాము సమర్థవంతంగా నడిపించామన్నారు. ఈ విషయాలను గుర్తుంచుకొని ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో తమ ప్యానెల్‌ను గెలిపించాలని హెచ్‌సీఏ సభ్యులను వివేక్ కోరారు.
‘హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం నేను వేసిన నామినేషన్‌ను రిజెక్ట్ చేశారు. ఎందుకు అని కనుక్కుంటే కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ ప్రకారం నా అప్లికేషన్‌ను తిరస్కరించారని తెలిసింది. కానీ, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన అజర్ నామినేషన్‌ను ఎలా అంగీకరించారో చెప్పాలని నేను పబ్లిక్‌గా ప్రశ్నిస్తున్నా. మ్యాచ్ ఫిక్సింగ్ చేశానని అజర్ బీసీసీఐ డిసిప్లినరీ కమిటీ ముందు ఒప్పుకున్నట్టు రిపోర్టులో ఉంది. కానీ, ఈ కేసులో హైకోర్టు తనకు క్లీన్‌చిట్ ఇచ్చిందని అజర్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. హైకోర్ట్ డెసిషన్ చూస్తే .. డిసిప్లినరీ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉండగా.. మీటింగ్‌ను ఒక మెంబర్ అటెండ్ చేయలేకపోయారు. మిగతా ఇద్దరు మెంబర్లు.. అజర్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు, అతడిని బ్యాన్ చేయాలని బీసీసీఐకి సూచిస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు అజర్ స్టేట్‌మెంట్‌ను పరిశీలించిన తర్వాత బీసీసీఐ అతడిని బ్యాన్ చేసింది. తనపై బ్యాన్‌ను ఎత్తి వేయాలని బీసీసీఐ సీఓఏను అజర్ కోరినా ఫలితం లేదు. బ్యాన్ లిఫ్ట్ చేయాలంటే బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్ ద్వారానే సాధ్యం అవుతుందని 2017 ఆగస్టు7న జరిగిన సమావేశంలో సీఓఏ స్పష్టం చేసింది. మరి, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్నప్పుడు, లైఫ్ బ్యాన్‌ను బోర్డు ఎత్తివేయకున్నా అజర్ నామినేషన్‌ను ఆమోదించినప్పుడు నా నామినేషన్‌ను ఎందుకు రిజెక్ట్ చేస్తారు?’అని వివేక్ ప్రశ్నించారు.
నా పైసలు, స్పాన్సర్‌షిప్ రైట్స్ పోయినయ్, పోస్ట్ కూడా పోయింది
‘నేను, మా విశాక ఇండస్ట్రీస్ డబ్బులు ఖర్చు పెట్టి ఉప్పల్ స్టేడియాన్ని నిర్మించాం. కానీ, మా కాంట్రాక్ట్‌ను, స్పాన్సర్‌షిప్ రైట్స్‌ను గతంలోని హెచ్‌సీఏ పాలక మండలి రద్దు చేసింది. దీనిపై ఆర్బిట్రేషన్‌కు వెళ్తే ఈ కాంట్రాక్ట్ క్యాన్సలైంది.. ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి కాబట్టి హెచ్‌సీఏ మాకు నష్ట పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. దీనిపై ఎవరూ అప్పీల్‌కు కూడా పోలేదు. అంటే విశాకకు, హెచ్‌సీఏకు మధ్య ఇక ఎలాంటి ఒప్పందం లేదన్నమాట. కాబట్టి కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ ప్రస్తావనే అనవసరం. అయినా ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా ఉన్న నర్సింహారెడ్డి తప్పుడు ఆధారాలు చూపి నన్ను పదవి నుంచి డిస్మిస్ చేశారు. నాకు అన్యాయం చేశారు. ఇప్పుడు అదే కారణంతో నా నామినేషన్‌ను రిజెక్ట్ చేశారు. హెచ్‌సీఏ అభివృద్ధి కోసం నేను డబ్బులు ఖర్చుపెట్టా. ఆ పైసలు పోయాయి. నా స్పాన్సర్‌షిప్ రైట్స్ పోయాయి. నా పోస్ట్ పోయింది. ఇప్పుడు హైకోర్టులో కేసు విచారణలో ఉన్నప్పటికీ నా నామినేషన్‌ను కూడా తిరస్కరించారు. అయినా ఎలక్టోరల్ ఆఫీసర్ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా. కానీ, హెచ్‌సీఏలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు అర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ హైకోర్టుకు ఇచ్చిన రిపోర్టులో పేర్లు ఉన్న వారి నామినేషన్లను మాత్రం అంగీకరించారు. అసోసియేషన్‌కు నిధులు ఇచ్చిన వారికేమో మొండిచేయి చూపించారు. ఇదెక్కడి న్యాయం’అని వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు.
క్రికెట్‌కు ఏదైనా చేయమంటే అజర్ ముందుకురాలేదు
తనకు క్రికెట్ గురించి ఏమీ తెలియదన్న అజర్ విమర్శలను వివేక్ కొట్టిపారేశారు. తాను ఉస్మానియా మెడికల్ కాలేజ్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించానని గుర్తు చేశారు. అజర్‌కే ఏ విషయంపై అవగాహన లేదన్నారు. ‘పెద్ద క్రికెటర్‌ను అని చెప్పుకొనే అజర్ అసలు హైదరాబాద్ క్రికెట్‌కు ఏం చేశాడో చెప్పాలి. ఒక్క క్రికెటర్‌నైనా ప్రోత్సహించాడా? మేమన్నా స్టేడియం కట్టేందుకు నిధులిచ్చినం. అన్ని చేసినం. మూడేళ్ల కిందట ఎన్నికల్లో పోటీ చేసేందుకు వచ్చాడు. దాని తర్వాత అయినా క్రికెట్‌కు ఏదైనా చేయాలి కదా?. నేను ఆహ్వానించినా రాలేదు. నా మీద కేసు వేసినా కూడా క్రికెట్‌కు ఏదైనా చేయాలని, పిల్లలను ట్రైన్ చేయాలని అజర్‌ను ఆహ్వానించా. వస్తే ఆయనకే మంచి పేరు వస్తుండె కదా? కానీ, రాలేదు. ఈ విషయాన్ని హెచ్‌సీఏ సభ్యులు గుర్తుంచుకోవాలి’అని వివేక్ అభిప్రాయపడ్డారు.
నిధులు లేకున్నా హెచ్‌సీఏను సమర్థంగా నడిపించాం
తాను ప్రెసిడెంట్‌గా ఉన్న ఏడాదిన్నర కాలంలో హెచ్‌సీఏను అన్ని విధాలుగా సమర్థవంతంగా నడిపించానని వివేక్ వెంకటస్వామి తెలిపారు. బీసీసీఐ నుంచి డబ్బులు లేకున్నా కూడా అన్ని మ్యాచ్‌లు సక్రమంగా జరిగేలా చూసుకున్నామని చెప్పారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 టోర్నమెంట్ నిర్వహించి జిల్లా క్రికెటర్లను ఎంకరేజ్ చేసేందుకు చేసిన ప్రయత్నాన్ని అందరూ అభినందించారని గుర్తు చేశారు. ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో ఓటు వేయాలని సభ్యులను కోరారు. ‘హెచ్‌సీఏను మంచి దారిలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. క్లబ్ సెక్రెటరీలు అందరూ ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని, మంచి వాళ్లు ఎవరో, అవినీతి ఆరోపణలు ఎవరిపై ఉన్నాయో గుర్తించాలి. మా ప్యానెల్ తరఫున ప్రకాశ్ చంద్ జైన్ (ప్రెసిడెంట్), దల్జీత్ సింగ్ (వైస్ ప్రెసిడెంట్), వెంకటేశ్వరన్ (సెక్రెటరీ), మాజీ క్రికెటర్ శివాజి (జాయింట్ సెక్రెటరీ), హనుమంత్ రెడ్డి (ట్రెజరర్), రవిందర్ సింగ్ ( కౌన్సిలర్) పోటీ పడుతున్నారు. వారిని గెలిపించాలని క్లబ్ సెక్రటరీలను కోరుతున్నా’అని వివేక్ తెలిపారు.

