తెలంగాణ తిరుమల.. భక్తుడి కోసం దిగివచ్చిన దేవుడు

తెలంగాణ తిరుమల.. భక్తుడి కోసం దిగివచ్చిన దేవుడు

భక్తుడి కోసం వెలిసిన దేవుడు.. ఏడు వందల ఏళ్ల నాటి చరిత్ర.. రెండో తిరుమలగా పేరుగాంచిన ఆలయం.. ఎన్నో ప్రత్యేకతల ఆలయం స్వయం వ్యక్త వేంకటేశ్వరస్వామి దేవాలయం. ఇది వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూర్ (వెంకటేశ్వరపల్లి)లో ఉంది. ఇక్కడి స్వామివారు కోరిన కోర్కెలను తీర్చుతాడని భక్తులు నమ్ముతారు. 1318 సంవత్సరంలో స్వామి ఇక్కడ వెలిసినట్లు చెబుతున్నారు.

దేశంలో వేములవాడ తర్వాత కోడెను కట్టే ఆలయాల్లో ఏకైక వైష్ణవాలయంగా గుర్తింపు పొందింది. శ్రీరంగంలో జరిగే ఆలయ సం ప్రదాయాల్లాగే ఇక్కడ ఆరాధన ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. నిత్యపూజలతోపాటు పండుగలు, శనివారాలు, విశేష ఉత్సవ రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. తిరుమలలో వేంకటేశ్వరస్వామికి క్షేత్ర పాలకుడిగా శివుడు వ్యవహరించినట్లుగా ఇక్కడ కూడా ఆలయానికి ముందు ఈశాన్య దిశగా శివాలయం ఉంది. ఈ దేవాలయం శిలానిర్మిత దేవాలయంగా సప్తతల రాజగోపుర వైభవంతో ఉంది. 

కరుణించిన భగవంతుడు

గర్భాలయాన్ని ఓ వైశ్య భక్తుడు నిర్మించాడని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఓ వైశ్యుడు ఏటా వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలకు కాలినడకన వెళ్లేవాడు. వృద్ధాప్యంలోనూ తిరు మలకు వెళ్తుండగా ప్రస్తుత ఆలయ ప్రదేశానికి రాగానే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ రోజు రాత్రి స్వామివారు అతడి కలలో కనిపించి 'ఇన్నేళ్లుగా నీవు నా దర్శనార్థం తిరుమలకు వస్తున్నావు.

also read : పాతగుట్టలో కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు

ఇప్పుడు నీకు వృద్ధాప్యం మీద పడింది. నడవ డానికి ఇబ్బంది పడుతున్నావు. అందుకే నేనే ఇక్కడ వెలుస్తున్నాను. నాకు పూజలు చేయండి ” అని చెప్పినట్లు ప్రచారంలో ఉంది. భక్తుడి కష్టం తెలుసుకుని అతడిని అనుగ్రహించేందుకే స్వామివారు స్వయంగా వచ్చారని, ఇది ఇక్కడి ప్రత్యేకతగా చెబుతున్నారు. మిగతా ఆలయ నిర్మాణాన్ని జనగామ జిల్లా కొడకండ్ల మండలం రంగాపురానికి చెందిన కుందూరు వంశీయులు, పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన ఎర్రబెల్లి వంశస్తులు నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు తె లుపుతున్నారు. ప్రస్తుతం ధర్మకర్తగా కుందూరు రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నట్లు, ఏటా బ్రహ్మో త్సవాలు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 

రాయిపైనే దేవతామూర్తులు

ఆలయంలో వేంకటేశ్వరస్వామితో పాటు ఇతర దేవతామూర్తులు పెద్ద రాయిపై వెలిసి నట్లు ఉంది. గుడి వెనుకభాగంలో పెద్ద రాయి మూడు భాగాలుగా విడిపోయి దక్షిణ ముఖంతో స్వామి వెలిశారు. బండ పొడవునా గోదాదేవి, రామానుజాచార్యులు, నమ్మాళ్వార్లు, మనవాల మహాముణి ఉన్నారు. వీటి ఆధారంగానే గుడి నిర్మాణం చేశారు.