మహిళా కమిషన్‌ కోసం ఉద్యమిస్తాం

మహిళా కమిషన్‌ కోసం ఉద్యమిస్తాం

హైదరాబాద్: మహిళల పై జరుగుతున్న దాడులను అరికట్టాలని.. మహిళ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాత్రి హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబెడ్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర మహిళ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళ నాయకులు ట్యాంక్ బండ్ పైకి ర్యాలీ గా వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఓ మహిళ నాయకురాలు స్పృహ తప్పి పడిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఆ పార్టీ మహిళ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. బతుకమ్మ, బోనాల పండుగలకు ముందుకు వచ్చి ఆర్భాటాలు చేసే అధికార మహిళ ప్రజా ప్రతినిధులు.. మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు జరిగినప్పుడు ముందుకురారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏడూ సంవత్సరాలుగా మహిళ కమీషన్ లేకుండా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దేశంలో నిర్భయ తరహా ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.  రాష్ట్రంలో మహిళాలు, యువతులు రోడ్లపై తిరిగే పరిస్తితిలేదన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. రక్షణ కోసం కఠిన చట్టాలు తీసుకురావడంలో విఫలమయ్యిందన్నారు. అందుకు మొయినాబాద్ లో బాలిక ఘటన సాక్ష్యం అన్నారు. ఆ సంఘటనను స్థానిక లీడర్లు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.