కార్మికులకు ఉచిత హెల్త్‌‌‌‌‌‌‌‌, లైఫ్‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ సౌకర్యం కల్పిస్తాం: మంత్రి వివేక్

కార్మికులకు ఉచిత హెల్త్‌‌‌‌‌‌‌‌, లైఫ్‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ సౌకర్యం కల్పిస్తాం: మంత్రి వివేక్
  • కార్మికులకు ఉచిత హెల్త్‌‌‌‌‌‌‌‌, లైఫ్‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ సౌకర్యం కల్పిస్తాం: మంత్రి వివేక్
  • గిగ్ వర్కర్ల చట్టం కింద త్వరలో రూల్స్ ఖరారు
  • టెక్నాలజీ ద్వారా ఇసుక మాఫియా కట్టడితో సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భారీ ఆదాయం 
  • సింగరేణి బొగ్గు మాయమైందన్న కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరోపణల్లో నిజం లేదని కామెంట్​
  • మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది అవుతున్న సందర్భంగా మీడియాతో సమావేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తీసుకొచ్చిన గిగ్‌‌‌‌‌‌‌‌ వర్కర్ల చట్టం కింద త్వరలో రూల్స్‌‌‌‌‌‌‌‌ ఖరారు చేయనున్నట్లు మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి తెలిపారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ చేతుల మీదుగా జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హమాలీలు, గృహ నిర్మాణ కార్మికుల వంటి అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేకంగా బోర్డు లేదా కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

గత పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో కనీస వేతనాల సవరణను నిర్లక్ష్యం చేశారని వివేక్​ మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక పరిశ్రమల ప్రతినిధులతో చర్చించి, కనీస వేతనాలను సవరించినట్లు పేర్కొన్నారు. హమాలీలు, గృహ నిర్మాణ కార్మికుల వంటి అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేకంగా సెస్ (పన్ను) సేకరించి, వారికి ఉచిత హెల్త్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యాలు కల్పించేలా ప్రత్యేక బోర్డు లేదా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి కల్పించేందుకు టాటా గ్రూప్ భాగస్వామ్యంతో రూ.4 వేల కోట్ల పెట్టుబడితో ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా మార్చామని తెలిపారు. ఈ నెల 10న మందమర్రిలో, 15న హైదరాబాద్‌లో జర్మన్ లాంగ్వేజ్ శిక్షణ కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు.

భవన నిర్మాణ కార్మికుల ప్రమాద బీమాను రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. సోమవారంతో కార్మిక ఉపాధి, గనుల శాఖ మంత్రిగా వివేక్ వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల్లో తీసుకొచ్చిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై సెక్రటేరియెట్‌లో మీడియాతో మాట్లాడారు.

కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈఎస్‌ఐ ఆసుపత్రులకు రూ.65 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో రామగుండం, ఫోర్త్ సిటీ, మహబూబ్‌నగర్ పరిధిలో మూడు కొత్త ఈఎస్‌ఐ ఆసుపత్రుల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఏ శాఖ అయినా తన మార్క్ చూపించేలా పనిచేయడమే తెలుసునని మంత్రి స్పష్టం చేశారు. 

టెక్నాలజీతో ఇసుక మాఫియా కట్టడి.. 
సీఎం ఆదేశాల మేరకు గనుల శాఖలో ఇసుక, మెటల్ మాఫియా ఆట కట్టించేందుకు కఠిన చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు టీజీఎండీసీ కేంద్రాల్లో వే బ్రిడ్జ్‌లు, సీసీటీవీ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఈ సంస్కరణల వల్ల గతేడాది కాలంలో ఇసుక ద్వారా వచ్చే రాబడి 37 శాతం పెరిగి, రూ.738 కోట్ల నుంచి రూ.1,008 కోట్లకు చేరిందన్నారు. 

ఈ ఏడాది గనుల శాఖ ద్వారా రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్ల ఆదాయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ నిధులను ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ల వంటి ప్రజా సంక్షేమ పథకాలకు మళ్లిస్తామని ఆయన తెలిపారు. మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణ కొనసాగుతోందని, విచారణ నివేదిక ఆధారంగా తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

మంజీరా నది పరివాహక ప్రాంతంలో మహారాష్ట్రకు చెందిన క్వారీ నిర్వాహకులు సరిహద్దులు దాటి అక్రమంగా ఇసుక మైనింగ్ జరగకుండా సరిహద్దుల్లో నిఘా పెంచి విజిలెన్స్ దాడులు నిర్వహిస్తామన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో సింగరేణి సంస్థ కేవలం రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్ల వరకు లాభాలు ఆర్జిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏకంగా రూ.4 వేల కోట్ల లాభాలను సాధించిందని వివరించారు. 

40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటూ కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ బొగ్గు మాయమైతే లాభాలు ఎట్లా వస్తాయని ఆయన ప్రశ్నించారు. అసలు అంత బొగ్గు తరలించాలంటే ఎన్ని లారీలు అవసరం అవుతాయో తెలుసా అని నిలదీశారు. సింగరేణి పనితీరును దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, వీటిలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. 

కమీషన్ల కోసమే కాళేశ్వరం..
కాళేశ్వరం ప్రాజెక్టు, అంతర్రాష్ట్ర నీటి ఒప్పందాలపై బీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి వివేక్‌ వెంకటస్వామి తప్పుబట్టారు. 240 టీఎంసీల నీటి కోసం ఒప్పందం చేసుకున్నామని ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వం, ఐదేండ్ల కాలంలో కేవలం 60 టీఎంసీల నీటిని మాత్రమే పంపింగ్ చేయగలిగిందని గుర్తుచేశారు. కేవలం కరెంట్ చార్జీల కోసమే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని విమర్శించారు.

కమీషన్ల కోసమే ప్రాజెక్టు అంచనాలను పెంచి తెలంగాణ ప్రజలపై రూ.లక్ష కోట్ల భారాన్ని మోపారని దుయ్యబట్టారు. చివరకు ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయి గత రెండేండ్లుగా కాళేశ్వరం నిరుపయోగంగా మారిందన్నారు. తుమ్మిడిహెట్టి విషయంలో తనపై బాధ్యత ఉందని, త్వరలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి అనుగుణంగా మహారాష్ట్రతో ఒప్పందంపై ముందుకు సాగుతామని తెలిపారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ సెక్రటరీ హరిచందన, మైన్స్ డైరెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.