ఔట్‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగులకూ వెయిటేజీ

ఔట్‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగులకూ వెయిటేజీ
  • వైద్యశాఖలో అమలుకు సర్కార్ యోచన

హైదరాబాద్, వెలుగు: సర్కారు దవాఖాన్లలో పనిచేస్తున్న ఔట్‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగులకు త్వరలో చేపట్టబోయే రెగ్యులర్ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌లో వెయిటేజీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో జరిగిన రిక్రూట్‌‌‌‌మెంట్లలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే వెయిటేజీ ఇవ్వగా, ఈసారి ఔట్‌‌‌‌సోర్సింగ్ వాళ్లకూ ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించామని ఓ ఉన్నతాధికారి ‘వెలుగు’కు తెలిపారు. సర్వీస్‌‌‌‌ ఆధారంగా మార్కులు జత చేయాలని భావిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ తేదీ, విధివిధానాలను ఖరారు చేసే పనిలో ఉన్నామన్నారు. 

పది రోజుల్లో నోటిఫికేషన్
హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో 12,735 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. 4,661 స్టాఫ్ నర్స్‌‌‌‌, 1,785 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్‌‌‌‌(ఫీమేల్), 1,183 అసిస్టెంట్ ప్రొఫెసర్, 357 ట్యూటర్, 758 మెడికల్ ఆఫీసర్(ఎంబీబీఎస్‌‌‌‌), 1,284 స్పెషలిస్ట్ డాక్టర్(సీఏఎస్) పోస్టులను హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయబోతున్నారు. పది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఆయా పోస్టుల సర్వీస్ రూల్స్‌‌‌‌, రిజర్వేషన్లకు సంబంధించిన రోస్టర్‌‌‌‌‌‌‌‌ పాయింట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అలాగే, గతంలో రిక్రూట్‌‌‌‌మెంట్లకు సంబంధించి కోర్టు కేసుల రికార్డులను తిరగదోడిన ఆఫీసర్లు.. ఆయా సమస్యలను చర్చించి కొత్త రూల్స్‌‌‌‌ ప్రతిపాదించారు. హెల్త్ సెక్రటరీ శనివారం జరగబోయే సమావేశంలో రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌కు సంబంధించిన విషయాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే మీటింగ్‌‌‌‌లో ఔట్‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగుల వెయిటేజీపై నిర్ణయం తీసుకోనున్నారు.

రిక్రూట్​మెంట్లు బోర్డుకు సవాలే
మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌మెంట్ బోర్డు ద్వారా ఇప్పటికి ఒకట్రెండు రిక్రూట్‌‌‌‌మెంట్లే జరిగాయి. అవి కూడా పదుల సంఖ్యలో పోస్టులున్న చిన్న నోటిఫికేషన్లే. ఇప్పుడు ఏకంగా 10,028 పోస్టుల భర్తీ బాధ్యతను బోర్డుకు అప్పగించారు. డాక్టర్ పోస్టుల రిక్రూట్‌‌‌‌మెంట్ పూర్తిగా అకడమిక్‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌లో వచ్చిన మార్కులు, సర్వీస్ వెయిటేజీ ఆధారంగా చేయనున్నారు. రాత పరీక్ష లేకపోవడంతో డాక్టర్ల రిక్రూట్‌‌‌‌మెంట్ సులభంగా అయిపోయేదే. స్టాఫ్‌‌‌‌ నర్స్‌‌‌‌లు, ఎంపీహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌(ఫీమేల్‌‌‌‌) పోస్టులకు మాత్రం రాత పరీక్ష నిర్వహించాలి. ఈ ఎగ్జామ్ బాధ్యతను జేఎన్‌‌‌‌టీయూ వంటి సంస్థలకు ఇవ్వాలని భావిస్తున్నారు. నోటిఫికేషన్‌‌‌‌, అప్లికేషన్ల స్వీకరణ, ఇతర టెక్నికల్ అంశాల కోసం సెంటర్ ఫర్ గుడ్‌‌‌‌ గవర్నన్స్‌‌‌‌, టీసీఎస్‌‌‌‌ వంటి సంస్థల సహకారం తీసుకోనున్నట్టు తెలిసింది.

15 వేల మందికిపైగా ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులు
ప్రభుత్వ దవాఖాన్లు, నేషనల్ హెల్త్ మిషన్‌‌‌‌కు సంబంధించిన ప్రోగ్రామ్స్‌‌‌‌లో అన్ని రకాల కేడర్ల వాళ్లు కలిపి 15 వేల మందికిపైగా ఔట్‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఇందులో నర్సింగ్ స్టాఫ్‌‌‌‌, ఏఎన్‌‌‌‌ఎంలు, ఇతర పారామెడికల్ స్టాఫ్ సంఖ్యే ఎక్కువ. గతంలో ఔట్‌‌‌‌సోర్సింగ్ వాళ్లకు వెయిటేజీ ఇవ్వకపోవడంపై కొంత మంది హైకోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న తమకూ వెయిటేజీ ఇప్పించాలని కోరారు. దీంతో రిక్రూట్‌‌‌‌మెంట్ ఆలస్యమైంది. ఈసారి అలాంటి చిక్కులు లేకుండా ఉండేందుకే, అందరికీ వెయిటేజీ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, గతంలో జరిగిన ఔట్‌‌‌‌సోర్సింగ్ రిక్రూట్‌‌‌‌మెంట్లలో రిజర్వేషన్లు పాటించలేదు. కాంట్రాక్టర్ తనకు నచ్చినవాళ్లను పనిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు వీళ్లకు వెయిటేజీ ఇస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం లేకపోలేదు. వైద్య శాఖలో ఔట్‌‌‌‌సోర్సింగ్ వాళ్లకు వెయిటేజీ ఇస్తే, మిగతా డిపార్ట్‌‌‌‌మెంట్లలోని ఔట్‌‌‌‌సోర్సింగ్ వాళ్లూ వెయిటేజీ కోరుతూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.