బెంగాల్ బీజేపీ నేత సువేందుపై కేసు నమోదు

బెంగాల్ బీజేపీ నేత సువేందుపై కేసు నమోదు
  • ప్రతీకార చర్యలకు దిగుతున్న తృణమూల్ 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తృణమూల్  పార్టీ కొత్త ప్రభుత్వం ప్రతీకార చర్యలు ప్రారంభించిందా.. ?  స్వయానా మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారితోపాటు ఆయన సోదరుడు,మిడ్నాపూర్  మాజీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిపై చోరీ కేసు నమోదు చేయడంతో టార్గెట్ బీజేపీ మొదలుపెట్టినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. తృణమూల్ శ్రేణులు కూడా ఈ విషయంపై బహిరంగంగా పెదవి విప్పకపోయినా.. అనేక మంది మాజీ తృణమూల్ నేతలు, బీజేపీలో చేరి ఓడిపోయిన వారంతా తిరిగి తృణమూల్ పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తుండడంతో టార్గెట్ బీజేపీ అవుననే స్పష్టం అవుతోంది. 
తాజాగా శనివారం లక్షల విలువ చేసే రిలీఫ్‌ మెటీరియల్‌ దొంగిలించారన్న ఆరోపణలపై బిజెపి నేత సువేందు అధికారి, ఆయన సోదరుడిపై పోలీస్‌ కేసు నమోదైంది. పూర్బా మెడ్నిపూర్‌ జిల్లాలోని మున్సిపల్‌ కార్యాలయం నుండి లక్షల విలువ చేసే రిలీఫ్ మెటీరియల్ ను దొంగలించారంటూ కేసు నమోదు చేయడం సంచలనం రేపింది. కాంతి మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బోర్డు సభ్యుడు రత్నదీప్‌ మన్నా చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
 గత నెల 29వ తేదీన బీజేపీ నేత, బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి, తన సోదరుడు కలసి మున్సిపాల్టిటీ కార్యాలయం గోడౌన్‌ తాళాలు  దౌర్జన్యంగా పగుల గొట్టి లక్షల విలువ చేసే సహాయ సామాగ్రిని తీసుకెళ్లారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కరోనా సహాయం అందించడంలో నిర్లక్ష్యాన్ని సహించలేని తృణమూల్‌ నేతలు సహాయ సామాగ్రిని కొట్టేస్తున్నారని గతంలో బీజేపీ ఆరోపణలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే సువేందు అధికారి ఆయన సోదరుడిపై ఇవే ఆరోపణలతో కేసు నమోదు చేయడం కలకలం రేపింది. దౌర్జన్యానికి పాల్పడే సమయంలో వారిద్దరు భద్రతా బలగాలను ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.