మతపరమైన ఆర్థిక సాయం బంద్..కేబినెట్ రెండో భేటీలో బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం

మతపరమైన ఆర్థిక సాయం బంద్..కేబినెట్ రెండో భేటీలో బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం

కోల్​కతా: పశ్చిమ బెంగాల్‌‌లో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం మతం ఆధారంగా అందజేస్తున్న ఆర్థిక సంక్షేమ పథకాలను రద్దు చేసింది. దీంతో రాష్ట్రంలోని నమోదైన మసీదులకు చెందిన ఇమాంలు, ముయిజ్జిన్లు, ఆలయ పూజారులకు ప్రతినెల అందిస్తున్న ఆర్థికసాయం ఇకపై బంద్ కానుంది. ఆ రాష్ట్ర సీఎం సువేందు అధికారి అధ్యక్షతన సోమవారం కోల్​కతాలో జరిగిన రెండో కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి పలు కొత్త పథకాలు ప్రకటించారు.

గతంలో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం ఇమాంలకు, ముయిజ్జిన్​(నమాజ్​కోసం ఆజాన్​ఇచ్చే వ్యక్తి)​లకు నెలకు రూ.3 వేలు చొప్పున, పూజారులకు రూ.2 వేల చొప్పున అందించేది. ఈ పథకాలను రద్దు చేసి వీటికి కేటాయించిన నిధులను వివేకానంద మెరిటోరియస్ స్కాలర్​ షిప్ లకు మళ్లిస్తామని సీఎం సువేందు తెలిపారు. మతంతో సంబంధం
లేకుండా తెలివైన విద్యార్థులకు ఈ నిధుల నుంచి స్కాలర్ షిప్ అందిస్తామని పేర్కొన్నారు.

మహిళల ఖాతాల్లో నెలకు 3వేలు

అన్నపూర్ణ పథకం కింద బెంగాల్ ప్రభుత్వం జూన్ 1 నుంచి మహిళలకు ప్రతి నెల రూ.3 వేలు ఇవ్వనుంది. అలాగే ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణానికీ ఆమోదం తెలిపింది. లక్ష్మీ భండార్ పథకంలో ఉన్న వారికి ఈ స్కీమ్​ల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. లక్ష్మీ భండార్ స్కీమ్​లోని లబ్ధిదారుల పేర్లు అన్నపూర్ణ స్కీమ్​లోకి నేరుగా తీసుకుంటారు. డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌‌ఫర్ ద్వారా మహిళల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సవరణ కోసం 7వ వేతన సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది. నగర పంచాయతీలు, విద్యా సంస్థల సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది.